
ప్రభుత్వ ఉద్యోగులపై చైనా ప్రభుత్వం వింత వింత ఆంక్షలు పెడుతోంది. ఉపాధ్యాయులు, వైద్యులు సహా ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ దేశం దాటి విదేశాలకు వెళ్లనీయడం లేదు. ప్రజల్లో సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, విదేశీ ప్రభావాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పెంచడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది.
కీలక ఆంక్షలు ఇవే..
పాస్ పోర్ట్ సరెండర్: చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఇప్పుడు తమ పాస్ పోర్ట్ లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.
వ్యక్తిగత ప్రయాణానికి అనుమతి తప్పనిసరి: విదేశాలలో వ్యక్తిగత సెలవులను కూడా యజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలు ఆమోదించాలి. అయితే విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.
విదేశాల్లో చదువుపై నిషేధం: చాలా ప్రావిన్సుల్లో విదేశాల్లో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పదవులకు అనర్హులు.
వ్యాపార ప్రయాణ ఆంక్షలు: సాధారణ పరిశోధన, అధ్యయనం ప్రయాణాలను కూడా అనేక ప్రాంతాలలో నిషేధించారు.
ఇదంతా ఎందుకంటే..
తమ దేశ ప్రజలపై ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులలో విదేశీ సైద్ధాంతిక ప్రభావం గురించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. రాజకీయ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతను బలోపేతం చేసే విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలతో ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కూడా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.
ఆంక్షల పరిధి, ప్రభావం
చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆంక్షలు చైనా శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థలలో పనిచేసే సుమారు 16.7 కోట్ల మందిపై వీటి ప్రభావం పడుతోంది. కొన్ని నగరాల్లో రిటైరైన వారు కూడా తమ పాస్‌పోర్టులను తిరిగి పొందడానికి రెండేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఉద్యోగులనైతే సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, తమ నివాస నగరాన్ని విడిచి వెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట.