
చాలా మంది భారతీయులు విదేశాల్లో విజయవంతమైన కెరీర్ సొంతం చేసుకోవడమే కాకుండా.. అతిపెద్ద పారిశ్రామికవేత్తల లీగ్‌లో కూడా నిలిచారు. వ్యాపార, పరిశ్రమల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వారిలో ఒకరు 'ప్రకాష్ లోహియా'. ఇంతకీ ఈయన ఎవరు?, నెట్‍వర్త్ ఎంత? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కోల్‌కతాకు చెందిన ప్రకాష్ లోహియా.. 1952 ఆగస్టు 11న మోహన్ లాల్ లోహియా & కాంచన్ దేవి లోహియా దంపతులకు జన్మించారు. 1973లో తన తండ్రితో కలిసి ఇండోనేషియాకు మకాం మార్చారు. అక్కడ వారు 1976లో స్పన్ నూలు ఉత్పత్తిదారు ఇండోరమా కార్పొరేషన్‌ను స్థాపించారు. ఈ కంపెనీ ఎరువులు, పాలియోలిఫిన్లు వంటి ఉత్పత్తులను తయారు చేసేది.

ప్రకాష్‌కు ఒక అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. కాబట్టి వీరి తండ్రి మోహన్ లాల్ లోహియా తమ వ్యాపారం వృద్ధి చెందడానికి, కుటుంబ వివాదాలను నివారించడానికి వారి 1980లలో ఆస్తిని ముగ్గురు కుమారులకు విభజించారు. ఆ తరువాత ప్రకాష్ లోహియా అన్నయ్య ఓం ప్రకాష్ భారతదేశానికి తిరిగి వచ్చి ఇండోరామా సింథటిక్స్‌ను స్థాపించారు. తమ్ముడు అలోక్ థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉన్ని నూలును తయారు చేసే ఇండోరామా హోల్డింగ్స్‌ను స్థాపించారు.

అన్న, తమ్ముడు సొంత వ్యాపారాలను ప్రారభించుకున్న తరువాత.. ప్రకాష్ లోహియా 2006లో నైజీరియాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఓలేఫిన్ ప్లాంట్‌ను కొనుగోలు చేశాడు. ఇది అప్పట్లోనే పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద పెట్రోకెమికల్ సంస్థ, ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద ఓలేఫిన్‌ల ఉత్పత్తిదారు.

ప్రకాష్ లోహియా.. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ & సీఈఓ, భారతదేశ బిలియనీర్లలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ సోదరి సీమా లోహియా భర్త. 2025 నాటికి ప్రపంచ బిలియనీర్లలో ఆయన 353వ స్థానంలో.. 2024 నాటికి ఇండోనేషియాలోని 50 మంది అత్యంత ధనవంతులలో ఆరవ స్థానంలో ఉన్నారు.
ఇదీ చదవండి: టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..
ప్రకాష్ లోహియా నెట్‍వర్త్
లోహియా నికర విలువ 8.3 బిలియన్ డాలర్ల (రూ. 72,000 కోట్లు) కంటే ఎక్కువ అని ఫోర్బ్స్ వెల్లడిస్తూ.. ఈయనను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా & ఇండోనేషియాలోని టాప్ పది బిలియనీర్లలో ఒకరిగా పేర్కొంది. ఈయన SP లోహియా ఫౌండేషన్‌ను కూడా స్థాపించి.. దీని ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు కళా కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు.