బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..!

Elon Musk Jeff Bezos Others Lose Over 26 Billion Wealth Due To Evergrande Crisis - Sakshi

చైనాకు చెందిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎవర్‌గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. ఎవర్‌గ్రాండే గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఇది ఒకటి. 2008 అమెరికాలో సుమారు 600 బిలియన్‌ డాలర్లకు దివాలా తీసిన సంస్థ లేమన్‌ బ్రదర్స్‌ మాదిరిగానే ఎవర్‌ గ్రాండే దివాలా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేమన్‌ బ్రదర్స్‌ తరహాలో ఎవర్‌గ్రాండే కూడా ప్రపంచంలో రెండో అతిపెద్ద సంక్షోభంగా నిలిచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: బ్యాంకులకు భారీ షాక్‌ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ !

శనిలా దాపురించిన ఎవర్‌గ్రాండే..!
తాజాగా ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రపంచంలోని బిలియనీర్లకు శనిలాగా పట్టుకుంది.  ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ తదితర బిలియనీర్లు ఏకంగా సుమారు 26 బిలియన్ల డాలర్ల(సుమారు రూ.1,92,082 కోట్ల రూపాయలు)పైగా నష్టపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత  ఎలోన్ మస్క్  నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు తగ్గి 198 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  సుమారు 5.6 బిలియన్‌  డాలర్లను కోల్పోగా, జెఫ్‌ బెజోస్‌ నికర విలువ 194 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 

ప్రపంచ బిలియనీర్ల జాబితాలోని మొదటి ఐదు స్థానాల్లోని మరో ముగ్గురు వ్యక్తులు లూయిస్ విట్టన్ ఎస్‌ఈ గ్రూప్ హెడ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండు బిలియన్‌ డాలర్లు నష్టపోయి 157 బిలియన్ డాలర్ల వద్ద, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 1.94 బిలియన్‌ డాలర్లు నష్టపోయి 149 బిలియన్ డాలర్ల వద్ద, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 3.27 బిలియన్‌ డాలరు​ నష్టపోయి.. 132 బిలియన్‌ వద్ద నిలిచారు. వారితో పాటుగా లారీపేజ్‌-సెర్జే బ్రిన్‌, స్టీవ్‌ బామర్‌, లారీ ఎల్లిసన్‌,  వారన్‌ బఫెట్‌ వరుసగా..1.9 , 1.8, 1.9 , బిలియన్‌ డాలర్లు, 764 మిలియన్‌ డాలర్లు, 701 మిలియన్‌ డాలర్లు నష్టపోయారు. 

వడ్డీలను చెల్లించలేం..ఇన్వెస్టర్లకు పంగనామాలు..!
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో 359 వ స్థానంలో నిలిచిన ఎవర్‌గ్రాండే వ్యవస్థాపకుడు,  ఛైర్మన్ హుయ్ కా యాన్ కంపెనీ షేర్లు 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో అతని నికర ఆస్తులు విలువ ర్యాంకింగ్‌లో తగ్గుదల కనిపించింది. ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో ఈ స్థాయిలో ట్రేడ్‌ అయ్యాయి. ఎవర్‌గ్రాండే చైనాలో రియల్‌ఎస్టేట్‌ రంగంలో అతి పెద్ద దిగ్గజం.  సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్‌ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్‌ డాలర్ల వడ్డీని  చెల్లించలేనని ఎవర్‌గ్రాండే ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top