బ్యాంకులకు భారీ షాక్‌ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ !

Srei Group May Leave AS Rs 28 Thousand Crore Hole In Some Of Indias Biggest Banks - Sakshi

SREI Infrastructure Finance Limited: చైనా ఎవర్‌గ్రాండ్‌ ఉదంతం పతాక శీర్షికల్లో ఉండగానే ఆ తరహా ఉపద్రవమే మన దగ్గర ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళన మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రియాల్టీ, ఫైనాన్స్‌ రంగాల్లో దేశవ్యాప్తంగా పేరున్న ఓ సంస్త ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందని సమాచారం. 

భారీగా రుణాలు
కోల్‌కతాకు చెందిన శ్రేయ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థ దేశ వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అంతేకాదు ఫైనాన్స్‌లో కూడా కాలు మోపింది. ఈ సంస్థ పనితీరుని నమ్మి యూకోబ్యాంకు, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో పాటు ప్రైవేటు , ప్రభుత్వ బ్యాంకులు భారీగా రుణాలు అందించాయి. 
పేలవ పనితీరు
గడిచిన కొన్నేళ్లుగా శ్రేయ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, ఫైనాన్స్‌(SREI) నిర్వాహాణా లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు కోవిడ్‌ పంజా కూడా ఈ కంపెనీపై పడింది. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది. కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా కటకటలాడే స్థికి చేరుకుంది. దీంతో ఈ నెల ఆరంభంలో ఆ కంపెనీ సీఈవో సైతం రాజీనామా చేశాడు. 

నిరర్థకమేనా ?
ఇప్పటికే శ్రేయ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, ఫైనాన్స్‌ సంస్థకు అప్పులు చెల్లించిన బ్యాంకులు ఈ సంస్థని నిరర్థక సంస్థగా గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాయంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగి తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తంగా శ్రేయ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, ఫైనాన్స్‌ కంపెనీ పేరు మీద రూ. 30,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఇందులో రూ. 28,000 కోట్ల అప్పులు అంటే దాదాపు నాలుగు బిలియన్‌ డాలర్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సేకరించినవే ఉన్నాయి. 

ఆస్తుల వేలం
మొత్తం అప్పుల్లో బ్యాంకుల నుంచి నేరుగా తీసుకున్న అప్పులు రూ. 18,000 కోట్లు ఉండగా మిగిలిన రూ. 10,000 కోట్లను ష్యూరిటీలు, బాండ్ల తదితర రూపాల్లో శ్రేయ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, ఫైనాన్స్‌ సంస్థ సేకరించింది. ప్రస్తుతం అప్పుల్లో ఉన్న మాట వాస్తవమే అయినా కొంత సమయం ఇస్తే అప్పులు చెల్లించేందుకు సంస్థ సిద్ధంగా ఉందంటూ ఆ కంపెనీ ప్రతినిధులు హామీ ఇస్తున్నారు.

తదుపరి చర్యలు
ఇప్పటికే శ్రేయ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, ఫైనాన్స్‌ సంస్థ పనితీరుపై బ్యాంకులు అసంతృప్తిగా ఉన్నాయి. నాన్‌ పెర్ఫార్మింగ్‌ అకౌంట్‌ ట్యాగ్‌ను ఇప్పటికే తగిలించాయి. ఈ సంస్థపై తదుపరి చర్యలకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. 

దెబ్బ మీద దెబ్బ
విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, మోహుల్‌ ఛోక్సీ ఉదంతాలతో  దెబ్బ తిన్న బ్యాంకింగ్‌ సెక్టార్‌పై కోవిడ్‌ మహమ్మారి మరో పోటు వేసింది. ఇంకా పూర్తిగా ఆ వ్యవస్థ గాడిన పడకముందే శ్రేయ్‌ రూపంలో మరో ముప్పు ఎదురైంది. 

చదవండి: ట్విన్‌ టవర్స్‌ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top