బిలియనీర్‌ టు మిలియనీర్‌.. 2021 ధనికులకు దరిద్రపు గొట్టు సంవత్సరమా?

China Real Estate Tycoon Lost Billions In Few Hours - Sakshi

 Zhang Yuanlin: ఆయనొక బిలియనీర్‌. కానీ,  వ్యాపారంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం కదా.  అలా మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం ఆయన కొంప ముంచింది. బిలియనీర్‌ నుంచి మిలియనీర్‌గా మార్చేసింది. అదీ ఒక్కపూటలో! చైనాలో వరుసబెట్టి కుబేరులందరికీ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి.  అంత బలమైన కారణం ఏంటంటే..  

ఝాంగ్‌ యువాన్లిన్‌.. సినిక్‌ హోల్డింగ్స్‌ గ్రూప్‌ చైర్మన్‌. హాంకాంగ్‌ బేస్డ్‌గా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రారాజుగా వెలుగొందాడు ఆయన.  నిన్న(సెప్టెంబర్‌ 20, సోమవారం) పొద్దున వరకు ఆయన ఆస్తుల విలువ 1.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కానీ, మధ్యాహ్నం కల్లా 250 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అంటే దాదాపు 83 శాతం ఆస్తి ఐస్‌లా కరిగిపోయిందన్న మాట. ఇందుకు కారణం.. చైనా రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒక్కసారిగా కుప్పకూలడమే.

ఝాంగ్‌ యువాన్లిన్‌

2010లో ఒంటరిగా ఈ కంపెనీ స్థాపించాడు ఝాంగ్‌ యువాన్లిన్‌. తన తెలివితేటలతో పైకొచ్చాడు.  2019లో హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ లిస్ట్‌లో, 2020లో చైనా కుబేరుల జాబితాలో నిలిచాడు ఝాంగ్‌.  ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఫోర్బ్స్‌ ధనికుల జాబితాలో.. ఫస్ట్‌ టైం చోటు కూడా సంపాదించుకున్నాడు. కానీ, ఆ ఆనందం నీరుకారడానికి ఎంతో టైం పట్టలేదు.  చైనాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండే డిఫాల్ట్‌ ప్రచారం, హాంకాంగ్‌లో వ్యాపారాన్ని నిలిపివేయడం.. తదితర కారణాలతో సినిక్‌ హోల్డింగ్స్‌ షేర్లు 87 శాతం పతనం అయ్యాయి. 

బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం 2021 సంవత్సరం అతిపెద్ద నికర విలువ క్షీణత కలిగిన 10 మంది బిలియనీర్లలో ఆరుగురు చైనాకు చెందిన వాళ్లే. వాళ్లలో అలీబాబా హెడ్‌ జాక్ మా కూడా ఉన్నాడు.  ఈ సంవత్సరం ఆయన సుమారు 6.9 బిలియన్ డాలర్ల(45 వేల కోట్లకుపైనే) సంపదను కోల్పోయారు.

ఇదిలా ఉంటే అక్టోబర్‌ 18లోపు 9.5 శాతం 246 మిలియన్ల బాండ్‌ను సినిక్‌ హోల్డింగ్స్‌ గ్రూప్‌ చెల్లించాల్సి ఉండగా.. అంతకంటే ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. తాజా పరిణామాలతో భారీ సంఖ్యలో ఇన్వెస్టర్లు, సప్లయర్స్‌..  సినిక్‌ ఆఫీసుల ఎదుట నిరసనలకు దిగారు. వాళ్లలో చాలామంది మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ కంపెనీ చెల్లించాల్సి ఉందని చెప్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నీ కేవలం ఆయన కంపెనీ మీద మాత్రమే చూపించలేదు.  మొత్తం చైనా రియల్‌ ఎస్టేట్‌ రంగమే కుదేలు అయ్యింది.

Evergrande పతనం నేపథ్యంలో రియాల్టీ రంగంపై ఈ ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఆర్థిక నిపుణులు. దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్‌ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌  "సాధారణ శ్రేయస్సు" (కామన్‌ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. ఇక చైనా జీడీపీలో పాతిక భాగం కంటే ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వాటా ఉంది. ఈ తరుణంలో తాజా కుదేలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చదవండి: పాపం.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్ల నష్టం అతనికి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top