భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఏ బైక్‌ ఎంత ధర పెరిగిందంటే!

Electric Two-wheelers Will Get More Expensive From June 1st - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, ఏథర్‌ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్‌ తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. సవరించిన ఫేమ్‌–2 సబ్సిడీ జూన్‌ 1 నుండి అమలులోకి రావడమే ఇందుకు కారణం. వేరియంట్‌ను బట్టి ఐక్యూబ్‌ ధరను రూ.17–22 వేల మధ్య పెంచినట్టు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ పేర్కొంది.

ఢిల్లీ ఎక్స్‌షోరూంలో గతంలో ఐక్యూబ్‌ బేస్‌ రూ.1,06,384, ఎస్‌ ట్రిమ్‌ ధర రూ.1,16,886 ఉంది. ఏథర్‌ 450ఎక్స్‌ ప్రో ధర సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్‌ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ‘ఫేమ్‌–2 సవరణ ఫలితంగా సుమారు రూ.32,000 సబ్సిడీ తగ్గింది. అయినప్పటికీ దేశంలో ఈవీ స్వీకరణను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ధరల ప్రభావంలో భారీ భాగాన్ని కంపెనీ గ్రహిస్తోంది’ అని ఏథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్‌నీత్‌ ఎస్‌ ఫోకెలా తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్‌ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. దీంతో ఎస్‌1–ప్రో రూ.1,39,999, ఎస్‌1 రూ.1,29,999, ఎస్‌1 ఎయిర్‌ ధర రూ.1,09,999 పలుకుతోంది. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయ తగ్గింపు ఉన్నప్పటికీ జూన్‌ నుండి ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచామని ఓలా ఎలక్ట్రిక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ చెప్పారు. 

ధర పెంచడం లేదు.. 
ఈ–స్కూటర్‌ మోడల్స్‌ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల స్వీకరణను ప్రోత్సహించడానికి, వాటి యాజమాన్య ఖర్చుపై ఉన్న అపోహలను తొలగించడానికి అంకితభావంతో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ‘ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీలకు రావాల్సిన సబ్సిడీలు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వద్ద 15 నెలలకు పైగా నిలిచిపోయాయి. మాపై తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ మేము చేయగలిగినంత వరకు మా ప్రస్తుత ధరలను కొనసాగుతాయి. తద్వారా వినియోగదారులకు సరసమైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో మా వంతు కృషిని కొనసాగిస్తాము’ అని హీరో ఎలక్ట్రిక్‌ సీఈవో సోహిందర్‌ గిల్‌ వివరించారు. 

లాయల్టీ బెనిఫిట్‌ ప్రోగ్రామ్‌.. 
‘రాబోయే కొన్ని త్రైమాసికాలలో ఫేమ్‌–2 సబ్సిడీ క్రమంగా తగ్గుతుంది. దేశంలోని ద్విచక్ర వాహనాల్లో కాలుష్య రహిత టూ–వీలర్ల వ్యాప్తిని ప్రోత్సహించడానికి కంపెనీ మెరుగైన ఉత్పత్తులు, గొప్ప విలువను అందించడం కొనసాగిస్తుంది’ అని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. ఫేమ్‌–2 సబ్సిడీలో కోత తర్వాత ఖర్చు భారాన్ని తగ్గించడానికి పరిమిత కాలానికి 2023 మే 20 వరకు బుకింగ్స్‌ చేసిన ఐక్యూబ్‌ కస్టమర్ల కోసం కంపెనీ లాయల్టీ బెనిఫిట్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తుందని వివరించారు.  

ఎక్స్‌–ఫ్యాక్టరీ ధరలో.. 
ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ ప్రోత్సాహకం కిలోవాట్‌కు రూ.10,000 ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ ప్రోత్సాహకాలపై పరిమితిని ఎక్స్‌–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాల వినియోగం పెంచేందుకు మూడేళ్ల కాల పరిమితితో ఫేమ్‌ పథకాన్ని 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top