ఈవీలకు భలే గిరాకీ..!  | Electric PV retail sales surge 95percent to 36,108 units in September 2026 | Sakshi
Sakshi News home page

ఈవీలకు భలే గిరాకీ..! 

Oct 8 2026 6:01 AM | Updated on Oct 8 2026 6:01 AM

Electric PV retail sales surge 95percent to 36,108 units in September 2026

సెప్టెంబర్‌లో మొత్తం విక్రయాలు @ 3.33 లక్షలు 

ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు దాదాపు రెట్టింపు 

టూ–వీలర్లలో ప్రతి తొమ్మిదింటిలో ఒకటి ఈవీ 

త్రీ–వీలర్లలో 64.9% వాటా 

వాణిజ్య ఈవీల్లో 155% వృద్ధి

న్యూఢిల్లీ: దేశీయ ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ) మార్కెట్‌ సెప్టెంబర్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ విక్రయాలు గతేడాది ఇదే నెలలోని 18,559 యూనిట్ల నుంచి దాదాపు రెట్టింపై 36,108 యూనిట్లకు చేరాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) తెలిపింది. మొత్తం ఈవీ విక్రయాలు సైతం 74.08 శాతం వార్షిక వృద్ధితో 3,33,634 యూనిట్లకు పెరిగాయి. 2025 సెప్టెంబర్‌లో ఇవి 1,91,497 యూనిట్లుగా నమోదయ్యాయి. 

వాహన మార్కెట్లో ఈవీల వాటాను (పెనెట్రేషన్‌) 10 శాతం నుంచి 13 శాతానికి పెరిగింది. ‘పండుగ వేళ డిమాండ్, తక్కువ నిర్వహణ వ్యయం, మార్కెట్లో విభిన్న రకాల మోడళ్లు అందుబాటులోకి రావడం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘పీఎం ఈ–డ్రైవ్‌’ తో పాటు రాష్ట్రాల పథకాల మద్దతు తదితర అంశాలు ఈవీ అమ్మకాల వృద్ధికి తోడ్పడ్డాయి’ అని ఫాడా పేర్కొంది. 

తద్వారా ఈవీలు కేవలం ‘ప్రత్యామ్నాయం’గా మాత్రమే కాకుండా, ఎక్కువ మంది కొనుగోలుదారులకు ‘తొలి ఎంపిక’గా మారుతున్నాయని తెలిపింది. ‘‘సాధారణ వాహన మార్కెట్లో గతేడాదితో పోలిస్తే కనిపించే లో–బేస్‌ అనుకూలత వల్ల వచ్చిన సాధారణ పెరుగుదల ఇది కాదు. ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనాల గణాంకాలు సరికొత్త ఆల్‌–టైమ్‌ రికార్డును నెలకొల్పాయి. ఈ వృద్ధి ఇక కేవలం సబ్సిడీల ఆధారంగా కాకుండా, వాస్తవ డిమాండ్‌ పెరుగుదలతో నడుస్తోంది’’ అని ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్‌ స్పష్టం చేశారు.  

సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్టానికి టూ వీలర్ల అమ్మకాలు  
ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలు సైతం సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరాయి. గతేడాది సెప్టెంబర్‌లోని 1,83,204 యూనిట్లతో పోలిస్తే 88.67 శాతం పెరిగి 2,07,314 యూనిట్లకు చేరాయి. మాస్‌ మార్కెట్‌ విభాగాలే ఈ రికార్డుకు ప్రధానంగా దోహదం చేశాయని ఫాడా తెలిపింది. కంపెనీల వారీగా చూస్తే బజాజ్‌ ఆటో 138.87 శాతం, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 125.87 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఈవీల వాటా 8.2 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగింది. అంటే ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి తొమ్మిది ద్విచక్ర వాహనాల్లో ఒకటి ఈవీ కావడం విశేషం. 

ఈవీ కార్లలో టాటా, మహీంద్రా జోరు 
ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌ లిమిటెడ్‌ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లోని 7,369 యూనిట్లతో పోలిస్తే కంపెనీ ఈవీ కార్ల విక్రయాలు దాదాపు రెట్టింపై 14,991 యూనిట్లకు చేరాయి. మహీంద్రా గ్రూప్‌ విక్రయాలు 95.82 శాతం పెరిగి 7,780 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వియత్నాం కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్‌ గతేడాది కేవలం ఆరు యూనిట్లు విక్రయించగా, ఈసారి 2,954 ఈవీ కార్లను విక్రయించింది. మొత్తం ఈవీ విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ కార్ల వాటా 5.7 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు సరికొత్త ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేశాయని ఫాడా తెలిపింది. 

త్రీ–వీలర్స్, వాణిజ్య ఈవీలు 
సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్‌ త్రీ–వీలర్ల విక్రయాలు గతేడాది ఇదే నెలలోని 61,434 యూనిట్ల నుంచి 40.03 శాతం పెరిగి 86,024 యూనిట్లకు చేరాయి. త్రీ–వీలర్ల విభాగంలో ఈవీల వాటా 64.9 శాతంగా ఉండటం ఈ విభాగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల స్వీకరణ నిర్మాణాత్మకంగా బలపడుతున్నదాన్ని సూచిస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాల (సీవీ) విక్రయాలు సెప్టెంబర్‌లో 1,622 యూనిట్ల నుంచి 4,138 యూనిట్లకు పెరిగాయి. అంటే వార్షికంగా 155.12 శాతం వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో ఈవీల మార్కెట్‌ వాటా 2.16 శాతం నుంచి 4.04 శాతానికి దాదాపు రెట్టింపైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement