దసరా, దీపావళి వంటి పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు, స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు లాంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా.. ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ అందుబాటులో ఉండటంతో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈసారి కూడా పండుగల సేల్స్‌లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ప్రారంభించిన సేల్స్‌కు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభించింది. కేవలం 48 గంటల్లోనే (రెండు రోజుల్లో) ఏకంగా రూ.24,200 కోట్ల విలువైన వస్తువులు అమ్ముడైనట్లు రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది.
రెండు రోజుల్లోనే..
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, జియో వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పండుగల సేల్స్ ప్రారంభం కావడంతో ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకుంది. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం.. మొదటి రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల మంది వినియోగదారులు ఈ సేల్స్‌లో పాల్గొన్నారు. వీరు మొత్తం 8 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ఆర్డర్లు చేసినట్లు అంచనా.
సాధారణ రోజుల్లో జరిగే వ్యాపారంతో పోలిస్తే ఈ రెండు రోజుల్లో నమోదైన అమ్మకాలు సుమారు ఆరు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. అంటే, పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు.. నిత్యావసరాలు, ఇతర వస్తువులను తక్కువ సమయంలో ఇంటికి చేర్చే క్విక్ కామర్స్ సేవలకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో సాధారణ రోజులతో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రెట్లు అధిక వ్యాపారం నమోదైనట్లు నివేదిక పేర్కొంది.
స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఇలా
ఈ పండుగల సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్లు అత్యధిక అమ్మకాలు సాధించిన ఉత్పత్తులుగా నిలిచాయి. కొత్త ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ డిస్కౌంట్లు, పాత ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉండటంతో చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. నివేదికలో వెల్లడైన.. మొత్తం అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్ల వాటా 38 నుంచి 40 శాతం వరకు ఉంది. వీటి విలువ సుమారు రూ.9,100 కోట్ల నుంచి రూ.9,600 కోట్లుగా అంచనా వేశారు.
గృహోపకరణాలకు డిమాండ్
స్మార్ట్‌ఫోన్ల తర్వాత కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు మంచి అమ్మకాలను నమోదు చేశాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ఈ విభాగం మొత్తం అమ్మకాల్లో 25 నుంచి 27 శాతం వాటాను దక్కించుకున్నట్లు నివేదిక అంచనా వేసింది. వీటి అమ్మకాల విలువ సుమారు రూ.6,000 కోట్ల నుంచి రూ.6,500 కోట్ల వరకు ఉంది.
ఫ్యాషన్ ఉత్పత్తుల సేల్స్
కొత్త బట్టలు, చెప్పులు, ఇతర ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోళ్లు కూడా జోరుగా సాగాయి. మొత్తం అమ్మకాల్లో.. ఫ్యాషన్ విభాగం 15 నుంచి 18 శాతం వాటాను పొందినట్లు అంచనా. ఈ విభాగం ద్వారా.. సుమారు రూ.3,630 కోట్ల నుంచి రూ.4,350 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే ఫ్యాషన్ దుస్తులకు చిన్న పట్టణాల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.
చిన్న పట్టణాల్లోనూ కూడా..
గతంలో ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా మెట్రో నగరాలకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు టైర్-2 నగరాలు, చిన్న పట్టణాల్లోనూ ఈ-కామర్స్ వినియోగం పెరుగుతోంది. ఇంటి వద్దకే వస్తువులు డెలివరీ కావడం, ధరలను పోల్చి చూసుకునే అవకాశం ఉండటం, ఆన్‌లైన్ ఆఫర్లు అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
ఇదీ చదవండి: యమహా పండుగ ఆఫర్స్.. బైక్ కొనేందుకు మంచి ఛాన్స్!


