
ఒక మాజీ ఉద్యోగి తొలగింపు లేఖ పరువు నష్టం కలిగించేలా ఉందని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఆ వ్యక్తికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ను ఆదేశించింది. విప్రో మాజీ ఉద్యోగి అభిజిత్ మిశ్రా రూ.2.1 కోట్ల నష్టపరిహారం కోరుతూ తన తొలగింపు లేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశాడు. జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.
51 పేజీల తీర్పులో హైకోర్టు కొన్ని అంశాలను పేర్కొంది. ఎలాంటి ఆధారం లేని తొలగింపు లేఖలు ఉద్యోగుల పరువు నష్టం కిందకు వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. లేఖలో ‘దురుద్దేశపూరిత ప్రవర్తన’ అనే పదాన్ని కంపెనీ చేర్చింది. అయితే అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో వెల్లడించలేదని ధర్మాసనం తెలిపింది. ఇది పిటిషనర్ భవిష్యత్తు ఉపాధి, వృత్తిపరమైన గౌరవంపై ప్రత్యక్ష, హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
మిశ్రా విప్రోలో ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుండేవాడు. జూన్ 5, 2020న కంపెనీ టర్మినేషన్ లేఖ పంపించింది. అందులో మిశ్రా ప్రవర్తన దురుద్దేశపూర్వకంగా ఉందని, ఇది యజమాని-ఉద్యోగి సంబంధంలో విపత్కర పరిస్థితులకు దారితీసిందని పేర్కొంది. వీటిని సవాలు చేస్తే మిశ్రా ఆ లేఖలో తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని, ఇది తన వ్యక్తిత్వాన్ని కించపరిచిందని, తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని కోర్టులు పిటిషన్ దాఖలు చేశాడు.