
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబరాలు మొదలయ్యాయి. సోదరులు.. సోదరీమణులు రక్షా బంధన్ జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా, సైబర్ నేరస్థులు కూడా కొత్త మోసాలకు తెరలేపారు. సాంప్రదాయ విక్రేతలకు బదులుగా ఆన్‌లైన్‌లో రాఖీలు, బహుమతులు, స్వీట్లు ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతుండడంతో, సైబర్ నేరస్థులు దీనిని అదనుగా తీసుకుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ క్లౌడ్‌సెక్ (CloudSEK) చెబుతోంది.
ఫిషింగ్ సందేశాలు: స్కామర్లు ఇన్‌బాక్స్‌లు, వాట్సాప్, ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా.. రాఖీ గిఫ్ట్ డెలివరీలు లేదా ఎక్స్‌క్లూజివ్ సేల్ కూపన్ల పేరుతో మెసేజస్ పంపవచ్చు. ఇలాంటి సందేశాలను క్లిక్ చేసినప్పుడు వచ్చే లింక్స్ ఫిల్ చేయడం, లేదా ఇతర చెల్లింపు వివరాలను పూర్తి చేసినప్పుడు మీ ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది.
ఫేక్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు: సైబర్ నేరస్థులు చట్టబద్ధమైన ప్లాట్‌ఫారమ్‌లను అనుకరించే మోసపూరిత వెబ్‌సైట్‌లను సృష్టిస్తారు. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్ విషయంలో కూడా వినియోగదారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
సోషల్ మీడియా స్కామ్: స్కామర్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ రాఖీ యాడ్స్ కూడా ప్రచారం చేయవచ్చు. ప్లాట్‌ఫామ్ చట్టబద్ధమైనదని భావించి, వినియోగదారుడు ఆర్థిక వివరాలను పంచుకుంటే మీ చెబుకు చిల్లు గ్యారెంటీ.
యూపీఐ & గిఫ్ట్ కార్డ్ స్కామ్‌లు: రాఖీ గిఫ్ట్ క్లెయిమ్‌ల మాదిరిగానే నకిలీ యూపీఐ అభ్యర్థనలు లేదా క్యూఆర్ కోడ్‌లు మీ మొబైల్ ఫోనుకు వస్తే.. వాటిపట్ల కొంత జాగ్రత్త వహించాలి.
స్కామ్‌ల నుంచి బయటపడే మార్గాలు
➤రాఖీలు, స్వీట్స్ లేదా గిఫ్ట్స్ వంటివి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకుంటే.. వినియోగదారుడు తప్పకుండా అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయాలి. నకిలీ వెబ్‌సైట్‌లు ఆఫర్స్ ఎరవేసి మిమ్మల్ని ఆకర్శించే అవకాశం ఉంది. కాబట్టి విశ్వసనీయ ప్లాట్‌ఫామ్‌ల నుంచి మాత్రమే ఆర్డర్ చేసుకోవాలి.
➤ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసినప్పుడు ఫిషింగ్ సైట్‌లు లేదా మాల్వేర్ డౌన్‌లోడ్‌లు జరిగే అవకాశం ఉంది. తెలియని నెంబర్స్ నుంచి వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు.
➤ఫేక్ సైట్‌లను గుర్తించాలి. నకిలీ సైట్‌లు దాదాపు అధికారిక సైట్‌ల మాదిరిగా కనిపించేలా స్కామర్లు పన్నాగాలు పన్నుతారు. అయితే కొన్ని చిన్న మార్పులు గమనించాలి. వెబ్‌సైట్ URLలలో తేడాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది.
రాఖీ పండుగ సంతోషంగా జరుపుకునే సమయం. అయితే స్కామర్లు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. ఆదమరిస్తే మోసపోవడం మీ వంతు అవుతుంది. కాబట్టి స్కామర్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా రక్షించాలి.