
ఏప్రిల్‌లో 5 శాతం డౌన్
భారత రత్నాభరణాల ఎగుమతులు (జెమ్స్, జ్యుయలరీ) ఏప్రిల్ నెలలో కొంత నీరసించాయి. గతేడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 4.62 శాతం తక్కువగా 2,037 మిలియన్ డాలర్లుగా (రూ.17,314 కోట్లు) నమోదయ్యాయి. 2024 ఏప్రిల్‌లో జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు 2,136 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.
ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసింది. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చి చూసినప్పుడు 6% తక్కువగా 1,109 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 1,181 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు సైతం 5.41 శాతం తగ్గాయి. 684 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాల ఎగుమతులు జరిగాయి.
క్రితం ఏడాది ఇదే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 724 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. పాలిష్ పట్టిన ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎగుమతులు 110.74 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు 12% క్షీణతతో 38.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కలర్డ్ జెమ్‌స్టోన్ ఎగుమతులు మాత్రం 12శాతం 27.76 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 24.8 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంచుతున్న ఫండ్స్ ఇవి..
కట్ చేసిన, సానబట్టిన వజ్రాలను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ గతంలో ‘డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ స్కీమ్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎగుమతులను పెంచడం, విలువను జోడించడం ఈ పథకం ఉద్దేశాలుగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. వజ్రాల పరిశ్రమ ఎగుమతులు క్షీణత, ఉపాధి నష్టాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. ఈ పథకం ఈ ధోరణికి చెక్‌పెట్టి పరిశ్రమకు పునరుజ్జీవాన్ని కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.