
అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ జోరు!
ఏడాదిలో 3.5 లక్షల కొత్త ఇన్వెస్టర్లు చేరిక
అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా గడిచిన ఏడాది కాలంలో ఈ విభాగంలో కొత్తగా 3.5 లక్షల మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. దీంతో 2025 ఏప్రిల్ నాటికి హైబ్రిడ్ ఫండ్స్ పరిధిలోని మొత్తం ఇన్వెస్టర్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 58 లక్షలకు చేరాయి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ సైతం 12 శాతం పెరిగి రూ.2.26 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 ఏప్రిల్ నాటికి ఈ మొత్తం రూ.2.02 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.
అగ్రెస్సివ్ హైబిడ్ ఫండ్స్ అన్నవి ఈక్విటీలతోపాటు డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈక్విటీలకు 65–80 శాతం మధ్య.. మిగిలిన మేర డెట్‌కు కేటాయింపులు చేస్తుంటాయి. తద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు, స్థిరత్వానికి ఇవి ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈక్విటీ పెట్టుబడుల అస్థిరతలను కొంత తగ్గించుకోవాలని చూసే వారికి ఇవి అనుకూలం. గతేడాది కాలంలో ఈక్విటీల్లో ఆటుపోట్లు పెరిగిపోయిన తరుణంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల ప్రాధాన్యం పెరిగినట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ 9 శాతం రాబడులను ఇవ్వగా.. రెండేళ్ల కాలంలో వార్షిక రాబడి 20 శాతం, మూడేళ్లలో 15 శాతం, ఐదేళ్లలో సగటున 21 శాతం చొప్పున ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఇవి అనుకూలమని ట్రేడ్‌జినీ సీవోవో త్రివేష్ సూచించారు.
ఇదీ చదవండి: పేటీఎమ్‌లో రూ.2,104 కోట్ల బ్లాక్‌డీల్
భవిష్యత్‌కు అనుకూలం..
రానున్న కాలానికి పెట్టుబడుల కోసంయాక్టివ్ నిర్వహణలోని అగ్రెస్సివ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ మొత్తంగా కాకుండా.. రంగాల వారీ, స్టాక్స్ వారీ కదలికలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. చురుకైన విధానంతో నడిచే అగ్రెస్సివ్ ఫండ్స్ మెరుగైన అవకాశాలను సొంతం చేసుకోగలవన్న అభిప్రాయాన్ని జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ వ్యక్తం చేశారు. సెబీ ఎఫ్‌అండ్‌వో నిబంధనలను కఠినతరం చేయడంతో కొందరు ఇన్వెస్టర్లు పన్ను ఆదా, బ్యాలన్స్‌డ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ విభాగంలో పదుల సంఖ్యలో పథకాలున్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 18.5–24 శాతం మధ్య ఉంది. ఈ తరహా ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను నిపుణులు సూచిస్తున్నారు.