పెట్టుబడుల్లో ఫ్రీ లంచ్ ఏదైనా ఉందంటే అది వైవిధ్యమే – హ్యారీ మార్కోవిజ్
సమతూకం ఎంతో అవసరం
పెట్టుబడులన్నీ ఒకే గూటి పక్షులు కాదు!
ఈక్విటీలతోపాటు డెట్ సాధనాలకూ ప్రాధాన్యం
ప్రతికూలతలను సమర్థంగా ఎదుర్కోవచ్చు
రిస్క్ సామర్థ్యం ఆధారంగా కేటాయింపులు
అందుబాటులో పలు రకాల మ్యూచువల్ ఫండ్స్
గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల్లో ఎలాంటి రాబడుల్లేవు. ఎన్నో ఆటుపోట్లను చూస్తున్నాం. ఇదే కాలంలో పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. డెట్ సాధనాలు సైతం స్థిరమైన రాబడులను అందించాయి. అంతెందుకు అంతర్జాతీయంగా ఎన్నో ఈక్విటీ మార్కెట్లు (యూఎస్, జపాన్, చైనా తదితర) గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులను పంచాయి. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం కాదని ఈ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.
పెట్టుబడులు ఎప్పుడూ కూడా ఒకే గూటి పక్షులు కాకూడదు. ఎందుకంటే ప్రతికూలతలు ఎదురైతే రాబడులు లేకపోగా, నికర నష్టాలను చూడాల్సి వస్తుంది. భిన్న
సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకుని, నికర రాబడుల దిశగా సాఫీగా ప్రయాణం చేయొచ్చు. ఇందుకు హైబ్రిడ్ ఫండ్స్ వీలు కల్పిస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్‌లో మొత్తం ఆరు విభాగాలు. వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెడుతూ వైవిధ్యాన్ని ఆఫర్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో వీటికి సైతం చోటివ్వాలి. తద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.
అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్
గతంలో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌గా వీటికి పేరు. చాలా కాలం నుంచి పనిచేస్తున్నాయి. ఈక్విటీలకు, డెట్ పెట్టుబడులను జోడించి స్థిరత్వాన్ని అందిస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం ఇవి కనీసం 65–80 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో (డెట్ ఇన్‌స్ట్రుమెంట్లు) పెట్టుబడిగా పెడతాయి. కొంత పెట్టుబడిని డెట్‌లోకి మళ్లించడం వల్ల ఆటుపోట్లను తట్టుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ కొన్ని ఈక్విటీలకు 75–80 శాతం వరకు కేటాయిస్తుంటాయి.
హైబ్రిడ్ ఫండ్స్ దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్ మాదిరిగా, బెంచ్‌మార్క్ స్థాయిలో రాబడులను అందిస్తుంటాయి. క్వాంట్ అగ్రెస్సివ్ హైబ్రిడ్, బీవోఐ మిడ్ అండ్ స్మాల్‌క్యాప్ ఈక్విటీ అండ్ డెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్ అయితే గత ఐదేళ్లలో ఏటా 23–24 శాతం స్థాయిలో కాంపౌండెడ్ వార్షిక రాబడులను (సీఏజీఆర్) అందించాయి. 65 శాతం తగ్గకుండా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నందున.. రూ.1.25 లక్షలకు మించిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. మధ్యస్థం నుంచి అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు, దీర్ఘకాల లక్ష్యాల కోసం వీటిని ఎంపిక చేసుకోవచ్చు.
బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్
వీటిని డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇవి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఈక్విటీలు–డెట్ సాధనాల మధ్య మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. రూ.3.05 లక్షల కోట్ల ఏయూఎంతో హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇది అతిపెద్ద విభాగంగా ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి స్థిరమైన పెట్టుబడుల విధానంతో పనిచేస్తుంటాయి. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ దీనికి భిన్నంగా పనిచేస్తాయి. ఈక్విటీ మార్కెట్ల విలువలు అసాధారణ స్థాయికి చేరాయని భావించినప్పుడు అక్కడ పెట్టబడులను గణనీయంగా తగ్గించుకుని (30–40 శాతానికి పరిమితం), డెట్‌లోకి మళ్లిస్తాయి.
ఈక్విటీల వ్యాల్యూషన్లు చౌకగా, ఆకర్షణీయంగా మారినప్పుడు తిరిగి డెట్ నుంచి అధిక మొత్తాన్ని (70 శాతం) వెనక్కి మళ్లిస్తాయి. దీనివల్ల పెట్టుబడుల విలువ పెద్దగా పతనం కాకుండా రక్షణ ఉంటుంది. ఇవి సాధారణంగా పీఈ, పుస్తకం విలువ, అస్థిరతలు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా వ్యాల్యూషన్లపై అంచనాకు వస్తాయి. లాభాలపై ఈక్విటీ పన్ను ప్రయోజనం కోసం ఈ విభాగంలో చాలా ఫండ్స్ 65 శాతం తగ్గకుండా ఈక్విటీలు, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (రెండు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ధరల వ్యత్యాసం) పెట్టుబడుల విధానాన్ని అనుసరిస్తున్నాయి.
గత ఏడాది కాలంలో నిఫ్టీ 100 టీఆర్‌ఐ 4 శాతం నష్టపోగా, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ నష్టం 0.8 శాతానికి పరిమితమైంది. గత ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతం వార్షిక రాబడి (5.2–29 శాతం మధ్య) ఈ పథకాల్లో నమోదైంది. ఈక్విటీ కేటాయింపులు 65 శాతం కంటే తక్కువగా ఉండే పథకాల్లో రాబడిపై పన్ను బాధ్యత భిన్నంగా ఉంటుంది. ఇవి నాన్ ఈక్విటీ, నాన్ డెట్ కిందకు వస్తాయి. ఈ తరహా ఫండ్స్‌లో రెండేళ్లు నిండిన పెట్టుబడులపై వచ్చే రాబడిలో 12.5 శాతం పన్ను కింద చెల్లించాలి. రెండేళ్లు నిండకుండా విక్రయించే పెట్టుబడులపై వచ్చే రాబడిని వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి.
కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్
పెట్టుబడులకు అస్థిరతలు చాలా తక్కువగా ఉండాలని భావించే వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఇవి పెట్టుబడుల్లో కనీసం 75 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కేవలం 10–25 శాతం మధ్యే ఈక్విటీలకు కేటాయిస్తుంటాయి. కనుక ఇవి డెట్ ప్రధానమైన పెట్టుబడులతో పనిచేస్తాయి. స్వల్ప మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో (పదేళ్లకు మించిన) వార్షిక రాబడి.. అచ్చమైన డెట్ సాధనాలతో పోల్చి చూస్తే 1–3 శాతం మధ్య అదనంగా వస్తాయని ఆశించొచ్చు.
ఇవి అధిక శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి కనుక పెట్టుబడులు పెట్టే ముందు వాటి పోర్ట్‌ఫోలియోని ఒకసారి గమనించాలి. ఈ విభాగంలో ఎక్కువ శాతం ఫండ్స్ డెట్ పెట్టుబడుల్లో క్రెడిట్ రిస్క్ తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటాయి. ఇందుకోసం అధిక శాతం పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. గత ఐదేళ్లలో రాబడులను గమనిస్తే 3.5 శాతం నుంచి 13.7 శాతం మధ్య ఉన్నాయి. సగటున 9 శాతం వార్షిక రాబడులను గమనించొచ్చు. డెట్ ఫండ్స్ కిందకు వస్తుండడంతో.. 2023 బడ్జెట్ తర్వాత నుంచి వచ్చిన కొత్త పన్ను నిబంధనల ప్రకారం.. ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్నది సంబంధం లేకుండా మూలధన లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి.
ఆర్బిట్రేజ్ ఫండ్స్
హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో అతి తక్కువ రిస్‌్కను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో చూడొచ్చు. సెబీ నిబంధనల ప్రకారం ఇవి కనీసం 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించాలి. కనుక వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. ఇవి ప్రధానంగా ఏం చేస్తాయంటే.. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర క్యాష్ మార్కెట్లో రూ.1,400 వద్ద ఉందని అనుకుందాం. అదే ఫ్యూచర్స్‌లో 1,410 వద్ద ఉందనుకుంటే.. క్యాష్‌లో కొని, ఫ్యూచర్స్‌లో విక్రయిస్తాయి. దీనివల్ల రూ.10 ప్రయోజనం దక్కుతుంది.
ఈ విధంగా స్పాట్, ఫ్యూచర్స్ విభాగాల్లో ధరల వ్యత్యాసం ఉన్న స్టాక్స్‌ను గుర్తించి ఎక్స్‌పోజర్ తీసుకుంటాయి. ఒక్కోసారి ఒకే స్టాక్ ధర రెండు ఎక్ఛేంజ్‌ల్లో (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ) కొంత వ్యత్యాసంతో ట్రేడవుతుంటాయి. అలాంటి అవకాశాలపైనా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇక మిగిలిన నిధులను స్వల్పకాల డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. కనుక వీటిల్లో రిస్క్ అతి తక్కువగా ఉంటుంది. గత ఐదేళ్లలో ఈ ఫండ్స్‌లో వార్షిక సగటు రాబడి 5.8 శాతంగా ఉంది. ఈక్విటీ ఫండ్స్ కిందకు వస్తాయి కనుక, పన్ను ప్రయోజనం (ఏటా రూ.1.25 లక్షలపై లాభం లేదు) సొంతం చేసుకోవచ్చు. స్వల్పకాలం కోసం (6–18 నెలలు) ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్
పేరులో ఉన్నట్టుగా ఒకటికి మించిన ఆస్తుల్లో (అసెట్స్) ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ కనీసం మూడు రకాల అసెట్ క్లాసెస్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఇక ప్రతీ అసెట్ క్లాస్‌కు కనీసం 10 శాతం పెట్టుబడులు కేటాయించాలన్నది నిబంధన. ఈ పథకాలతో ఉన్న గొప్ప ప్రయోజనం వైవిధ్యం. ఈ విభాగంలో 31 ఫండ్స్ పనిచేస్తున్నాయి. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ అవకాశాలు, బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, కమోడిటీ డెరివేటివ్‌లు, విదేశీ ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (రీట్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్) తదితర సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి.
కోటక్, సుందరం, హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ అసెట్ ఫండ్స్ అయితే ఈక్విటీ పన్ను ప్రయోజనం దృష్టితో కనీసం 65 శాతాన్ని ఈక్విటీలకు కేటాయిస్తున్నాయి. ఎడెల్‌వీజ్ మల్టీ అస్సెట్ ఫండ్ అయితే డెట్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోంది. వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపుల్లో ఈ పథకాల మధ్య ఏకరూపత ఉండదు. కనుక రాబడులను పథకాల వారీగా చూడాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో వీటి రాబడి వార్షికంగా 10–15 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. గత ఏడాది కాలంగా ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వనప్పటికీ, ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు రెట్టింపు కావడాన్ని గమనించాలి. ఈ దృష్టితో మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌కు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది.
ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్
సెబీ నిబంధనల ప్రకారం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక ఇవి 15–30 శాతం మధ్య నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మరో 35–45 శాతం మేర పెట్టుబడులను ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాలకు కేటాయిస్తుంటాయి. 25–35 శాతం మధ్య డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. 65 శాతం కేటాయింపుల కారణంగా ఈక్విటీ పెట్టబుడులకు మాదిరే లాభాలపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ పథకాల్లో గత ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే.. సగటు వార్షిక రాబడి 10 శాతంగా ఉంది. డెట్ ఫండ్స్ కంటే స్వల్ప అదనపు రాబడి ఈ పథకాల నుంచి ఆశించొచ్చు. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఇవి ఎక్కువగా కేటాయిస్తుంటాయి. కనుక ఈక్విటీ పెట్టుబడుల కారణంగా ఏదురయ్యే రిస్క్ చాలా పరిమితమే. రిస్క్ పెద్దగా తీసుకోకుండా, కొంత మెరుగైన రాబడి ఆశించే వారికి ఈ పథకాలు అనుకూలం. అంతేకాదు రిటైర్మెంట్ తీసుకున్న వారు సైతం లంప్‌సమ్‌గా ఇన్వెస్ట్ చేసుకుని, ప్రతి నెలా కొంత చొప్పున ఉపసంహరించుకునే ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌కు అనుకూలం.
– సాక్షి, బిజినెస్ డెస్క్


