రోహిత్ శర్మ అపార్ట్‌మెంట్స్ అద్దెకు.. నెలకు లక్షల్లో సంపాదన | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్లు అద్దెకు ఇచ్చిన రోహిత్‌ శర్మ.. నెలకు లక్షల్లో సంపాదన

Published Sat, Jan 20 2024 5:06 PM

Cricketer Rohit Sharma Leases Two Apartments in Mumbai - Sakshi

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే రీతిలో.. సినిమా, క్రికెట్ రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు రియల్ ఎస్టేట్ వైపు ఆసక్తి చూస్తున్నారు. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్, మనోజ్ బాజ్‌పేయీ, అజయ్ దేవ్‌గణ్, సారా అలీఖాన్, కాజోల్ వంటి పలువురు ప్రముఖులు ముంబైలో ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. అయితే.. ఇటీవల క్రికెటర్ 'రోహిత్ శర్మ' ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని తన రెండు అపార్ట్‌మెంట్‌లను లీజుకు ఇచ్చినట్లు తెలిసింది.

రోహిత్ శర్మ ఈ అపార్ట్‌మెంట్‌లను మూడేళ్ల వ్యవధికి లీజుకి ఇచ్చినట్లు సమాచారం. ఈ అద్దె మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ. 3.1 లక్షలు, రెండో సంవత్సరం నెలకు రూ. 3.25 లక్షలు, మూడో సంవత్సరం నెలకు రూ. 3.41 లక్షల అద్దెకు ఒప్పందం కురుర్చుకున్నారు. దీనికి సంబంధించిన రెంట్ అగ్రిమెంట్ 2024 జనవరి 4న జరిగినట్లు తెలిసింది.

అద్దెదారు డిపాజిట్ రూపంలో అడ్వాన్స్ కింద రూ. 9.3 లక్షలు చెల్లించారని సమాచారం. ఈ రెండు అపార్ట్‌మెంట్‌లు 14వ అంతస్థులో 1047 చదరపు అడుగులు విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ అంతకు ముందు కూడా 2022లో రెండు అపార్ట్‌మెంట్‌లను నెలకు రూ. 2.5 లక్షల అద్దెకు ఇచ్చారు.

ఇతర సెలబ్రిటీలు
సెలబ్రిటీలు తమ ఆస్తులను లీజుకు/అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో తన ఫ్లాట్‌ను నెలకు రూ.1.50 లక్షల అద్దె చొప్పున మూడేళ్లకు ఇచ్చినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా?

అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వాణిజ్య యూనిట్లను అద్దెకు ఇస్తున్నారు. ఈ స్పేస్ కోసం మూడు సంవత్సరాల లీజుకు 'వార్నర్ మ్యూజిక్ ఇండియా లిమిటెడ్‌' రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించినట్లు సమాచారం. దీని ద్వారా అమితాబ్ సంవత్సరానికి రూ.2.07 కోట్లు అద్దె సంపాదిస్తున్నారు. నాలుగవ సంవత్సరం నుంచి అద్దె ఏడాదికి రూ.2.38 కోట్లకు చేరనుంది.

Advertisement
 
Advertisement