
ఆగస్టులో దాదాపు 7 లక్షల కొత్త కార్డుల జారీ
ఏడు నెలల గరిష్ట స్థాయిలో ఇష్యూ
11.23 కోట్లకు చేరిన మొత్తం యాక్టివ్ కార్డుల సంఖ్య
న్యూఢిల్లీ: పండగ సీజన్ డిమాండ్ నేపథ్యంలో బ్యాంకులు పోటాపోటీగా పెద్ద స్థాయిలో క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం ఆగస్టులో దాదాపు 7,00,000 కార్డులను ఇష్యూ చేశాయి. ఇది ఏడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. దీంతో మొత్తం యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 11.23 కోట్లకు చేరింది. నెలవారీగా క్రెడిట్ కార్డులపై చేసే ఖర్చు రూ. 1.91 లక్షల కోట్లుగా నమోదైంది. వార్షికంగా 13.7 శాతం పెరిగింది. గతేడాది ఆగస్టులో ఈ వ్యయాలు రూ. 1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి.
తాజాగా హెచ్‌డీఎఫ్ బ్యాంక్ కార్డులపై కొనుగోలుదారులు చేసిన వ్యయాలు 24 శాతం పెరిగి ఏకంగా రూ. 53,873 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 33,063 కోట్లతో (24.8 శాతం వృద్ధి) ఎస్‌బీఐ కార్డ్ రెండో స్థానంలో ఉంది. పండగ సీజన్‌లో కస్టమర్లు గణనీయంగా ఖర్చు చేస్తున్న ధోరణి కనిపిస్తోందని కోటక్ మహీంద్రా బ్యాంక్ బిజినెస్ హెడ్ (క్రెడిట్ కార్డ్స్) ఫ్రెడరిక్ డిసౌజా తెలిపారు. ట్రావెల్, లైఫ్‌స్టయిల్‌లాంటి అంశాలపై వ్యయం చేయడం పెరిగిందని పేర్కొన్నారు. పన్నులపరమైన ప్రయోజనాలు కూడా తోడు కావడం వల్ల క్రెడిట్ కార్డుల వినియోగం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్లు వివరించారు.
ఎప్పట్లాగే ఆన్‌లైన్ లావాదేవీలు అత్యధికంగా ఉంటున్నాయని, కార్డుల వినియోగానికి ఎల్రక్టానిక్స్, ట్రావెల్, లైఫ్‌స్టయిల్ కొనుగోళ్లు దన్నుగా నిలుస్తున్నాయని డిసౌజా పేర్కొన్నారు. వినియోగదారులు ప్రీమియం, మరింత ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపే ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. అలాగే జీఎస్‌టీ ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రత్యేక డిస్కౌంట్లు, ఈజీ పేమెంట్ ఆప్షన్లు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో కంపెనీలు దూకుడుగా పండగ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటం కూడా వ్యాపారాలకు మరింతగా ఊతమివ్వగలదని పేర్కొన్నారు. పీడబ్ల్యూసీ ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్‌బుక్ ప్రకారం, జెన్–జడ్ వినియోగదారుల సెగ్మెంట్లో, ద్వితీయ..చిన్న నగరాల్లో క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగు తోంది.
డేటా ఇలా..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూలైలో జారీ చేసిన 3,15,000 కార్డులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, మిగతా బ్యాంకులతో పోలిస్తే అత్యధికంగా 2,21,000 కొత్త కార్డులను జారీ చేసింది. దీంతో ఆ బ్యాంకులోని మొత్తం కార్డుల సంఖ్య 2.5 కోట్లకు చేరింది. 1,40,000 కొత్త కార్డులతో యాక్సిస్ బ్యాంక్ రెండో స్థానంలో నిల్చింది. జూలైలో జారీ చేసిన 1,22,000 కార్డులను కూడా కలిపితే మొత్తం కార్డుల సంఖ్య 1.53 కోట్లకు చేరింది. అటు ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా 1,30,000 ఇష్యూ చేయడంతో మొత్తం సంఖ్య 1.81 కోట్లకు ఎగిసింది. జూలైలో నమోదైన 67,664 కార్డులతో పోలిస్తే బ్యాంకు ఆగస్టులో రెట్టింపు సంఖ్యలో జారీ చేసింది. ఇక రెండో అతి పెద్ద ఇష్యూయర్ అయిన ఎస్‌బీఐ కార్డ్స్ కొత్తగా 69,531 ఇష్యూ చేయడంతో మొత్తం కార్డుల సంఖ్య 2.13 కోట్లకు చేరింది. అయితే, ఆర్‌బీఎల్ బ్యాంక్ కార్డులు మాత్రం 1,00,000 తగ్గడంతో మొత్తం యాక్టివ్ కార్డుల సంఖ్య 45 లక్షలకు తగ్గింది. అయినప్పటికీ పండగ సీజన్‌పై బ్యాంకు ఆశావహంగా ఉంది.