
పండుగల సందడి టాటా మోటార్స్‌కు బంపర్ సేల్‌ని తీసుకువచ్చింది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల విభాగంలో మరో మైలురాయిని చేరుకుంది. ఇటీవల ముగిసిన పండుగ సీజన్ సందర్భంగా కంపెనీ ఒక్క నెలలో లక్ష యూనిట్ల విక్రయాలు సాధించి, సరికొత్త రికార్డు నెలకొల్పింది.
నవరాత్రులు నుంచి దీపావళి వరకు అంటే సుమారు 30 రోజుల కాలంలో 1 లక్షకు పైగా ప్యాసింజర్ వాహనాలను డెలివరీ చేశామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. ఈ గణాంకాలు గతేడాది ఇదే పండుగ సీజన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి.
ఎస్‌యూవీలకే ఎక్కువ డిమాండ్
పండుగ సీజన్‌లో ఎస్‌యూవీల పట్ల వినియోగదారుల ఆకర్షణ మరింత పెరిగింది. టాటా మోటార్స్ విక్రయించిన వాహనాల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
నెక్సాన్ విక్రయాలు 73 శాతం పెరిగి సుమారు 38,000 యూనిట్ల వరకు చేరుకున్నాయి. పంచ్ ఎస్‌యూవీలు 29 శాతం వృద్ధితో సుమారు 32,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఈవీ విభాగంలోనూ పురోగతి
పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యత ఇస్తున్న వినియోగదారులు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ఎంపిక చేస్తున్నారు. కంపెనీ ఈవీ పోర్ట్‌ఫోలియోలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఈ సీజన్‌లో 37 శాతం వృద్ధితో 10,000కు పైగా ఈవీ వాహనాలు డెలివరీ చేసినట్టు శైలేష్ చంద్ర తెలిపారు.