
ద్వైపాక్షిక వాణిజ్యాలతో ఫలితం
సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి
న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, స్వల్పకాల ప్రబావాలను అధిగమించే సామర్థ్యం దేశ ఆర్థిక వ్యవస్థకు ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. వడ్డీ రేట్లు కొంత తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడాన్ని ప్రస్తావించారు. వడ్డీ రేట్లు మరింత దిగొస్తాయన్న అంచనాను వ్యక్తీకరించారు.
బడ్జెట్‌లో ఆదాయపన్ను రాయితీలు కల్పించడం, ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడాన్ని సానుకూలంగా పేర్కొన్నారు. ఇంధనం, రవాణా, మెటల్స్, కెమికల్స్, ఆతిథ్య రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడుల విషయంలో కొంత అప్రమత్తతకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు.
వాణిజ్య అడ్డంకులు పెరిగిపోతున్న క్రమంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కీలక భాగస్వాములతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను తప్పకుండా కుదుర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యూస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్‌లు ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణాత్మక ధోరణి పెరుగుతున్నట్టు చెప్పారు.
వాణిజ్యానికి మరిన్ని అవరోధాలు ఏర్పడుతున్న దృష్ట్యా ద్వైపాక్షిక వాణిజ్యాల ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా యూస్, ఈయూలతో ఒప్పందం ఎంతో కీలకమన్నారు. దేశీయంగా వృద్ధి చోదకాలు, పోటీతత్వం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో ఎంతో పరిశోధన, కృషి అవసరమన్నారు. గ్రామీణ వినియోగం పుంజుకున్నప్పటికీ పట్టణ వినియోగం ఫ్లాట్‌గా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో పట్టణ వినియోగం సైతం వేగాన్ని అందుకుంటుందని సంజీవ్ పురి అంచనా వేశారు.