
స్టాంప్ డ్యూటీలో ఏకరూపత తేవాలి
తద్వారా తయారీ కేంద్రంగా భారత్
ప్రభుత్వానికి సీఐఐ సూచనలు
భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు సమగ్ర భూ సంస్కరణలను చేపట్టాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కీలక సూచనలు చేసింది. సమన్వయంతో, ఏకాభిప్రాయంతో కూడిన సంస్కరణలు అమలు చేసేందుకు, దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్య ఒకే స్టాంప్ డ్యూటీని అమలు చేసేందుందుకు వీలుగా జీఎస్‌టీ మాదిరి కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది.
రక్షణాత్మక ధోరణి, వాణిజ్య యుద్ధాలు సవాలును విసురుతున్నాయంటూ.. భారత్‌లో స్థిరమైన విధానాలు, బలమైన పారిశ్రామిక సామర్థ్యాలు, దేశీయంగా అతిపెద్ద వినియోగ మార్కెట్, యువ శ్రామిక శక్తి, విశ్వసనీయ భాగస్వామిగా చాలా దేశాల్లో ఉన్న గుర్తింపు.. ఇవన్నీ భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చగలవని సీఐఐ తెలిపింది. ప్రతీ రాష్ట్రంలోనూ సమగ్ర భూ నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, భూ వినియోగ మార్పిడిని పూర్తిగా డిజిటలైజ్ చేయడంతోపాటు స్టాంప్ డ్యూటీని 3–5 శాతం మధ్య స్థిరీకరణ చేయాలని సూచించింది. స్పష్టమైన భూ యాజమాన్యం దిశగా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ చర్యల ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు చేరువ కావొచ్చని
అభిప్రాయపడింది.
సమ్మిళిత వృద్ధి..
భారత్‌లో తయారీకి ఊతమివ్వడమే కాకుండా, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచే దిశగా బలమైన భూ సంస్కరణలు అమలు చేయాలని సీఐఐ కోరింది. గ్రామీణాభివృద్ధి సామర్థ్యాలను వెలికితీయడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించొచ్చంటూ కీలక సూచనలు చేసింది.
భూ చట్టాల నిర్వహణ ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉంది. కనుక కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారానికి వీలుగా జీఎస్‌టీ కౌన్సిల్ మాదిరి ఏర్పాటు చేయాలి. సమన్వయం, ఏకాభిప్రాయం ఆధారంగా ఈ సంస్థ సంస్కరణలు చేపట్టాలి.
ఇండియా ఇండ్రస్టియల్ ల్యాండ్ బ్యాంక్ (ఐఐఎల్‌బీ) ఏర్పాటు ప్రశంసనీయమేనంటూ, ఇందులో ఉన్న సవాళ్లను ప్రస్తావించింది. ప్రస్తుతం ఇది కేవలం సమాచార సాధనంగానే పనిచేస్తోంది. రాష్ట్రాల మధ్య భూముల కేటాయింపు అధికారాలు సైతం ఉండాలి. దీనివల్ల పారదర్శకత పెరిగి, భూముల సమీకరణ సులభతరం అవుతుంది.
ఇదీ చదవండి: టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!
రాష్ట్రాల స్థాయిల్లోనూ ఒకటికి మించిన అధికార యంత్రాంగాలు ఉండడాన్ని అవరోధంగా పేర్కొంది. దీన్ని అధిగమించేందుకు ఇంటెగ్రేటెడ్ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయాలి. భూములు కేటాయింపు, మార్పిడి, వివాదాల పరిష్కార అధికారాలు దీనికి ఉండాలి.
భూ మార్పిడి విధానం డిజిటైజేషన్ చేయాలి. డిజిటల్ సంతకం పెట్టిన సర్టిఫికెట్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత మూడో పక్షం ధ్రువీకరణతో పారదర్శకత తీసుకురావచ్చు. అవినీతిని తొలగించొచ్చు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలు వేర్వేరుగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 3–5 శాతం మధ్యలో ఏకే విధమైన రేటును అమలు చేయాలి.