బంగారంతో.. చైనా మాస్టర్ ప్లాన్! | China Buys 23 Tonnes Of Gold In September 2026 Marking Its Biggest Monthly Purchase Since 2023, Check Out More Details | Sakshi
Sakshi News home page

బంగారంతో.. చైనా మాస్టర్ ప్లాన్!

Oct 10 2026 3:52 PM | Updated on Oct 10 2026 4:42 PM

China Buys 23 Tonnes of Gold in September Highest Monthly Purchase Since 2023

ప్రపంచవ్యాప్తంగా.. దాదాపు అన్ని దేశాలు తమ ఆర్థిక నిల్వలను బలపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా బంగారం కొనుగోళ్లను భారీగా పెంచుతోంది. సాధారణంగా మనం బంగారాన్ని ఆభరణాల కోసం.. లేదా పెట్టుబడిగా కొనుగోలు చేస్తాం. కానీ దేశాలు మాత్రం బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక పెద్ద ఆర్థిక వ్యూహం ఉంటుంది.

చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) 2026 సెప్టెంబర్‌లో ఏకంగా 23 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 2023 తర్వాత ఒక నెలలో చైనా కొనుగోలు చేసిన అత్యధిక బంగారం ఇదే కావడం విశేషం. అంతేకాదు.. చైనా వరుసగా 23 నెలల నుంచి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తూనే ఉంది.

జూలై, ఆగస్టు నెలల్లో 20 టన్నుల చొప్పున బంగారం కొనుగోలు చేసిన చైనా.. సెప్టెంబర్‌లో ఆ మొత్తాన్ని 23 టన్నులకు పెంచింది. దీంతో 2026లో ఇప్పటివరకు కొనుగోలు చేసిన బంగారం 103 టన్నులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చైనా వద్ద మొత్తం 2,410 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది.

చైనా ఎందుకు భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది!
చైనా భారీగా బంగారం కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. తన ఆర్థిక నిల్వలను మరింత పెంచుకోవడానికే. ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమ విదేశీ నిల్వల్లో ఎక్కువ భాగాన్ని డాలర్లు, ఇతర కరెన్సీలు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఉంచుతాయి. అయితే.. ఒకే కరెన్సీపై ఎక్కువగా ఆధారపడితే, ఆ కరెన్సీ విలువలో మార్పులు వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

అందుకే.. చైనా తన నిల్వల్లో బంగారం వాటాను గణనీయంగా పెంచుకుంటోంది. బంగారం అనేది ఏ ఒక్క దేశ ప్రభుత్వంపై ఆధారపడని ఆస్తి. ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు లేదా అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు బంగారం ఒక ప్రత్యామ్నాయ నిల్వగా ఉపయోగపడుతుంది.

ఫ్రాన్స్, ఇటలీలకు దగ్గరవుతున్న చైనా!
ప్రస్తుతం బంగారు నిల్వల పరంగా చైనా ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు దాని కంటే ముందున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ దేశాలకు, చైనాకు మధ్య ఉన్న అంతరం క్రమంగా తగ్గుతోంది.

ఇదీ చదవండి: ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే?

కొన్ని నివేదికల ప్రకారం.. ఇటలీ వద్ద సుమారు 2,452 టన్నులు, ఫ్రాన్స్ వద్ద 2,437 టన్నుల బంగారం ఉంది. చైనా వద్ద 2,410 టన్నులు ఉన్నాయి. అంటే.. ఫ్రాన్స్‌ను అధిగమించడానికి చైనాకు మరో 27 టన్నులు, ఇటలీని అధిగమించడానికి 42 టన్నులు మాత్రమే అవసరం. ఇదే వేగంతో చైనా బంగారం కొనుగోళ్లను కొనసాగిస్తే.. భవిష్యత్తులో ఫ్రాన్స్, ఇటలీ దేశాలను వెనక్కి నెట్టి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే అది ఎప్పుడు జరుగుతుందనేది చైనా భవిష్యత్తులో చేసే కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement