
ఆదాయాన్ని దెబ్బతీసే చాన్స్
ఐటీ దిగ్గజం విప్రో అంచనాలు
న్యూఢిల్లీ: టారిఫ్‌లు, యూఎస్ వలస విధానాలు ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమున్నట్లు ఐటీ సేవల దిగ్గజం విప్రో తాజాగా అంచనా వేసింది. భారీ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల టారిఫ్‌లు, వాణిజ్య విధానాలు కంపెనీ ఆదాయం, బిజినెస్‌లను దెబ్బతీయవచ్చని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, నియంత్రణల వాతావరణం కంపెనీ కార్యకలాపాలకు ప్రస్తావించదగ్గ స్థాయిలో రిస్క్ లను కల్చించే వీలున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఆదాయంలో వృద్ధికి అంతర్జాతీయ మార్కెట్లపై అధికంగా ఆధారపడే ఐటీ సేవల దిగ్గజం విప్రో 2024–25 వార్షిక నివేదికలో ఈ అంశాలను వివరించింది.
అమెరికా, యూరప్ దేశాలలో క్లయింట్లు అధికంగా కలిగిన కంపెనీ కొన్ని రంగాల క్లయింట్ల నుంచి అధికంగా బిజినెస్ లభిస్తుందని పేర్కొంది. అయితే ఆర్థిక మందగమనం, యూఎస్ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రతికూల పరిస్థితులకు కారణంకావచ్చని అభిప్రాయపడింది. కంపెనీ ఆదాయంలో 62 శాతం యూఎస్, 27 శాతం యూరప్ నుంచి లభించే సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 కాగా.. గతేడాది (2024–25)లో రూ. 89,088 కోట్ల ఆదాయం అందుకుంది. నికర లాభం 19 శాతం ఎగసి రూ. 13,135 కోట్లను దాటింది. ఈ ఏడాది (2025–26) క్యూ1(ఏప్రిల్– జూన్)లో త్రైమాసికవారీగా 250.5–255.7 కోట్ల డాలర్ల ఆదాయం అంచనా వేస్తోంది.
బీఎస్‌ఈలో విప్రో షేరు 0.6 శాతం బలపడి రూ. 247 వద్ద ముగిసింది.