
అమెరికాలో పనిచేస్తూ కొత్త ఫీజు, నిబంధనల కారణంగా హెచ్-1బి వీసా (H-1B Visa) పొందలేకపోయిన టెక్నాలజీ రంగ నిపుణలకు కెనడా దేశం గాలం వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త వీసా ఛార్జీలకు ముందు యూఎస్‌లో పనిచేసిన టెక్ ఉద్యోగులను తమ దేశానికి ఆకర్షించాలనుకుంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.
తాజాగా లండన్లో విలేకరులతో మార్క్ కార్నీ మాట్లాడుతూ తమ ఆలోచనను బయటపెట్టారు. గతంలో హెచ్ -1బీ వీసాలు ఉన్న వారిని ఆకర్షించే అవకాశం స్పష్టంగా ఉందని కార్నీ వెల్లడించారు. అలాంటి వారిలో టెక్ రంగ ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
కొత్త హెచ్ -1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్, ఇతర ఉద్యోగాల్లో ప్రపంచ ప్రతిభను తీసుకురావడానికి కొత్త హెచ్ -1బి ప్రోగ్రామ్పై ఆధారపడే కంపెనీలకు గందరగోళం, నిరాశను సృష్టించింది.
కెనడా (Canada) ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ వ్యూహాన్ని సమీక్షిస్తున్నప్పుడు, ఈ రకమైన ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే అంశాన్ని గ్రహించడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, దానిపై "స్పష్టమైన సమర్పణ" ఉంటుందని కార్నీ చెప్పారు.
హెచ్-1బి వీసాలు చేజారి, అమెరికాలో పని చేసేందుకు అవకాశాలు కోల్పోయినవారిని పలు ఇతర దేశాలు కూడా ఆకర్షిస్తున్నాయి. జర్మనీ, యూకే వంటి దేశాలు నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా తమను తాము పేర్కొంటున్నాయి.