ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన 'బిట్‌కాయిన్' ఇటీవల 60,000 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. కొద్ది రోజుల క్రితం వరకు బలంగా కనిపించిన బిట్‌కాయిన్ ధర ఒక్కసారిగా సుమారు 59,000 డాలర్ల వరకు పడిపోవడంతో, క్రిప్టో మార్కెట్ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. దాదాపు 20 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన ఈ పతనం వెనుక అనేక అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ధర పతనానికి ప్రధాన కారణం.. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల పతనం, అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై కొనసాగుతున్న ఆందోళనలు, పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి దూరంగా వెళ్లడం వంటి అంశాలు క్రిప్టో మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
Pi42 సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అవినాష్ శేఖర్ ప్రకారం.. బిట్‌కాయిన్ ధర తగ్గడానికి పెద్ద పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం, మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడటం, అలాగే డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ కారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సహజమేనని, దీర్ఘకాలిక విలువ, స్వల్పకాలిక ధరల మధ్య పెట్టుబడిదారులు తేడాను గుర్తిస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్‌లో సానుకూల వార్తలు లేకపోవడం కూడా ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా అమెరికాలో ప్రతిపాదిత క్లారిటీ యాక్ట్ అమలుపై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తోందని బిట్‌డెల్టా ఇండియా సీఈఓ వికాస్ ఎం సచ్‌దేవా అన్నారు.
అమెరికా డాలర్ బలపడటం కూడా బిట్‌కాయిన్ పతనానికి కారణమని ముడ్రెక్స్ బిజినెస్ హెడ్ ప్రతీక్ గుప్తా అన్నారు. అమెరికా డాలర్ సూచీ గత 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు బిట్‌కాయిన్ వంటి క్రిప్టో ఆస్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం క్రిప్టో మార్కెట్‌పై ఒత్తిడి కనిపిస్తోంది.
అయితే.. ఈ పతనం మధ్యలో కూడా కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌లో జరిగే కార్యకలాపాలు మాత్రం బలంగానే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నెట్‌వర్క్ యాక్టివిటీ క్రమంగా పెరుగుతుండగా, రోజువారీ లావాదేవీలు 8 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇది గత బుల్‌రన్ సమయంలో కనిపించిన స్థాయిలకు దగ్గరగా ఉండటం విశేషం. అంటే ధర తగ్గుతున్నప్పటికీ, బిట్‌కాయిన్ వినియోగం,నెట్‌వర్క్ కార్యకలాపాలపై విశ్వాసం ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి, బిట్‌కాయిన్ పతనమైందని అనుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో అస్థిరత మరికొంతకాలం కొనసాగవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పెట్టుబడులను విభజించడం, దశలవారీగా పెట్టుబడి పెట్టడం వంటి వ్యూహాలను అనుసరించాలని సూచిస్తున్నారు.


