Sakshi News home page

ఎయిర్‌టెల్‌ లాభం ఫ్లాట్‌

Published Sat, Aug 5 2023 6:30 AM

Bharti Airtel Net profit flat at Rs 1612 crore Q1 results - Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్‌చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్‌ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది.  

4జీ యూజర్లు అప్‌
తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్‌  పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్‌ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్‌పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు.  

ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది.

Advertisement

What’s your opinion

Advertisement