
ఈ ఏడాది పితృ పక్షాలు గ్రహణంతో ప్రారంభం అయ్యాయి. తిరిగి గ్రహణంతోనే ముగియనున్నాయి. అంటే.. సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణంతో ప్రారంభమై.. సెప్టెంబర్ 21, ఆదివారం, అమావాస్య నాడు సంభవించబోయే సూర్యగ్రహణం రోజున ముగియనున్నాయి.
సుమారు 100 ఏళ్ల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లు పండితులు, పెద్దలు చెబుతున్నారు. వివేకవంతులు ఈ రోజులను సద్వినియోగం చేసుకుంటారు.
అదెలాగంటే...
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పితృదోషాల వల్ల అనేక రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చేపట్టిన పనులలో పదే పదే ఆటంకాలు కలగడం, కీర్తి, గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, ఎవరో ఒకరికి మానసిక స్థితి సరిగా లేకుండా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, ఒకవేళ సంతానం కలిగినా ఆ పుట్టిన సంతానం జీవించకపోవడం వంటి సమస్యలు సంభవించే అవకాశం ఉంది.
ఇవన్నీ పితృ శాపాల వల్ల లేదా పితృదేవతలు అసంతృప్తికి గురవడం వల్ల కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల పితృ పక్షాల సమయం పూర్వీకుల ఆశీస్సుల కోసం అలాగే పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు అనుకూలమైన సమయం. అలాగే.. మహాలయ పక్షంలో ఆచరించే శ్రాద్ధ కర్మలు, దానాలు, పుణ్య కార్యాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలిగి, వంశాభివృద్ధి అవుతుంది. పితృదోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.
పితృపక్షంలో రోజూ సాయంత్రం పితృదేవతా నిలయమైన నైరుతి మూలన దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, అలాగే.. పితృదేవతలను స్మరించుకుంటూ వారి కోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని కూడా బలమైన నమ్మకం.
అలాగే.. పితృదేవతలకు రోజూ అపరాహ్న వేళ అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జల తర్పణాలు వదలాలి. ఒకవేళ జల తర్పణాలు 15 రోజులు వదలడం వీలు కాని వాళ్లు మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలి. కాకులకు, జంతువులకు ఆహారం పెట్టాలి. పేదవారికి అన్నదానం, వస్త్ర దానం చేయడం, పండితులకు, గురువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.
పితృ పక్షం సమయంలో ఇంట్లో పూజలు, హోమాలు ఆచరించడం పుణ్యప్రదం. పితృపక్షంలో ఇప్పటికే వారం రోజులకు పైగా గడిచిపోయింది. ఇంకా వారం కూడా పూర్తిగా లేదు. అందువల్ల చివరి రోజైన మహాలయ అమావాస్య వరకు వాయిదా వేయకుండా వీలయినప్పుడల్లా పేదలకు అన్నదానం చేయడం మంచిది. ఇక మహాలయ అమావాస్య రోజున తర్పణాలు వదిలే కార్యక్రమం పూర్తి చేశాక.. దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మాత్రమే తిరిగి శుభకార్యాలు
ప్రారంభించాలి.
– డి.వి.ఆర్.