
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌మెంట్(ఐసీఐఎల్) తాజాగా 0.98 శాతం వాటా విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం రెండు దశలలో 6 కోట్ల షేర్లు అమ్మివేసింది. ఒక్కో షేరుకి రూ. 1,870–1,872 ధరల శ్రేణిలో రూ. 11,227 కోట్లకు వాటా విక్రయించింది.
అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. తాజా లావాదేవీ తదుపరి ఎయిర్‌టెల్‌లో ఐసీఐఎల్ వాటా 2.47 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గింది. వెరసి మొత్తం ప్రమోటర్ల వాటా 51.25 శాతం నుంచి 50.27 శాతానికి దిగివచ్చింది. ప్రమోటర్లలో భారతీ టెలికం అత్యధికంగా 40.47 శాతం వాటా కలిగి ఉంది. వాటా విక్రయం నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 1,860 వద్ద ముగిసింది.