Barclays Report Said That India CAD deficit 60 billion dollars - Sakshi
Sakshi News home page

60 బిలియన్‌ డాలర్లకు క్యాడ్‌ లోటు

Published Fri, Dec 3 2021 9:12 AM

Barclays Report Said That India CAD deficit 60 billion dollars - Sakshi

ముంబై: భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 60 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని  బ్రిటన్‌ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం– బార్‌క్లేస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత 45 బిలియన్‌ డాలర్ల అంచనాలను ఎగువముఖంగా సవరించింది. బార్‌క్లేస్‌ తాజా అంచనాలు నిజమైతే, క్యాడ్‌ పరిమాణం 2021–22 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 2 శాతంగా ఉంటుంది.   

కరెంట్‌ అకౌంట్‌ అంటే... 
ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని  ప్రతిబింబించేదే కరెంట్‌ అకౌంట్‌. వచ్చినదానికన్నా ఇతర దేశాలకు చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్‌ అకౌంట్‌ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్‌ అకౌంట్‌ మిగులు.   

2020–21లో మిగులే 
కరోనా సవాళ్లు, దిగుమతులు భారీగా పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే (2020 ఏప్రిల్‌–2021 మార్చి) కరెంట్‌ అకౌంట్‌ మిగుల్లోనే ఉంది. విలువలో 102.2 బిలియన్‌ డాలర్లుగా (జీడీపీలో 0.9 శాతం) నమోదయ్యింది. 2021–22 మొదటి త్రైమాసికంలోనూ తిరిగి మిగులును నమోదుచేయడం గమనార్హం. 2021–22 క్యూ1 (ఏప్రిల్‌–జూన్‌)లో కరెంట్‌ అకౌంట్‌  6.5 బిలియన్‌ డాలర్ల మిగులు (జీడీపీలో 0.9 శాతం)  ఉంది. 2021–22 మొత్తంగా కూడా కరెంట్‌ అకౌంట్‌ మిగులే నమోదవుతుందని తొలుత అంచనాలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి గణనీయంగా మారుతూ వచ్చింది.  అంతర్జాతీయంగా ముడి చమురు, బొగ్గు, మెటల్‌ వంటి కీలక దిగుమతి ఉత్పత్తుల ధరలు తీవ్రంకావడం వల్ల కరెంట్‌ అకౌంట్‌ను లోటు దిశగా నడిపిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

మారకద్రవ్య నిల్వల బలం 
కాగా భారత్‌ వద్ద ఉన్న 600 బిలియన్‌ డాలర్లకుపైగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయంగా ఒడిదుడుకుల నుంచి దేశ ప్రయోజనాలు కాపాడ్డానికి దోహదపడతాయని అంచనా. దాదాపు 15 నెలల దిగుమతులకు సరిపడా నిల్వలు భారత్‌ వద్ద ఉండడం గమనార్హం. 2013లో జీడీపీలో 15 శాతం ఫారెక్స్‌ నిల్వలు ఉంటే, ఇప్పుడు ఈ నిష్పత్తి దాదాపు 22 శాతానికి పెరిగింది.  

Advertisement
Advertisement