
కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి ఆగస్టులో రిలయన్స్ జియో జోరు కొనసాగగా, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ దాదాపు ఏడాది తర్వాత భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం మొబైల్ సెగ్మెంట్లో ఆగస్టులో నికరంగా 35.19 లక్షల కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. జియో కస్టమర్లు అత్యధికంగా 19 లక్షల మేర పెరగ్గా బీఎస్‌ఎన్‌ఎల్ (13.85 లక్షలు), ఎయిర్‌టెల్ (4.96 లక్షలు) తర్వాత స్థానాల్లో నిల్చాయి.
చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అన్ని ప్రైవేట్ సంస్థలను మించి బీఎస్‌ఎన్‌ఎల్ అత్యధికంగా యూజర్లను దక్కించుకుంది. అప్పట్లో కంపెనీ 3జీ సేవలను మాత్రమే అందించేది. అయితే, ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లను పెంచేయడం బీఎస్‌ఎన్‌ఎల్‌కి కలిసొచ్చింది. కంపెనీ ఇటీవలే దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించింది. ఇక, తాజాగా జూలైలో 122 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ సబ్ర్‌స్కయిబర్స్ సంఖ్య ఆగస్టులో 122.45 కోట్లకు చేరింది.
వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 3.08 లక్షల యూజర్లను కోల్పోయింది. బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్లో (మొబైల్, ఫిక్సిడ్ లైన్ కలిపి) 50 కోట్ల కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో 30.9 కోట్ల కనెక్షన్లతో భారతి ఎయిర్‌టెల్, 12.7 కోట్లతో వొడాఫోన్ ఐడియా, 3.43 కోట్ల కనెక్షన్లతో బీఎస్‌ఎన్‌ఎల్, 23.5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లతో ఏట్రియా కన్వర్జెన్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు