ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పుడు ఓ విచిత్రమైన ఉద్యోగ ప్రకటనతో వార్తల్లోకి వచ్చింది. ఐఫోన్లు, మ్యాక్‌లతో ఏ మాత్రం సంబంధం లేని ఈ పోస్టు యంత్రాల నిర్వహణకు సంబంధించింది. అమెరికాలోని కాలిఫోర్నియా శాంటా క్లారాలో ‘ఐకప్ సప్లై స్పెషలిస్ట్’ పోస్టు కోసం యాపిల్ ప్రకటన ఇచ్చింది. ఉద్యోగులందరికీ విరామ గదుల్లో తాజా కాఫీ అందుబాటులో ఉండేలా చూడటమే ఈ ఉద్యోగి బాధ్యత.
వేతనం ఎంత?
ఈ పోస్టుకు గంటకు 27.75 నుంచి 36.05 డాలర్ల వరకు (భారత కరెన్సీలో సుమారు రూ.2,670–3,500) బేసిక్ పే నిర్ణయించారు. గరిష్ఠ వేతనాన్ని రోజుకు ఎనిమిది గంటల పని చొప్పున లెక్కిస్తే సుమారు రూ.28 వేలు అవుతుంది.
బాధ్యతలేమిటి?
ఎంపికైన వ్యక్తి వేర్వేరు ప్రాంతాలకు వాహనంలో వెళ్లి గరిష్ఠంగా 90 బీన్-టు-కప్ కాఫీ యంత్రాలను శుభ్రం చేసి స్టోరేజీని మేనేజ్ చేయాలి. కాఫీ గింజలు, ఇతర సామగ్రిని నింపడం, వాటిని శుభ్రపరచడం రోజువారీ పనుల్లో భాగం. ‘యాపిల్‌లో మేం కాఫీ ఎక్కువగా తాగుతాం. ఈ ఉద్యోగంలోకి రావాలనుకునే అభ్యర్థులకు అసాధారణ సేవాభావం ఉండాలి’ అని యాపిల్ కోరింది. అయితే ‘ఐకప్’ అనే పేరును యాపిల్ 2014 నుంచే వాడుతోంది.
కంపెనీ ఆఫర్ చేస్తున్న వేతనాన్ని భారత కరెన్సీలోకి మార్చి చూస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ అమెరికాలో జీవన వ్యయం, పన్నులు, గంటల ఆధారిత వేతన విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది ఇంజినీరింగ్ ఉద్యోగం కాదు, క్షేత్రస్థాయి సర్వీసు జాబ్. అయినా ఉద్యోగుల సౌకర్యాన్ని ఇంత సీరియస్‌గా చూసే యాపిల్ సంస్కృతి ఈ ప్రకటనలో కనిపిస్తోంది.
ఇదీ చదవండి: పసిడి ధరలపై ఓ లుక్కేయండి!


