బ్లిస్ జీవీఎస్ ద్వారా తుది ఔషధాలు
ఫార్మా రంగం నుంచి మూడో వంతు ఆదాయం
అనుపమ్ రసాయన్ సీఈవో గోపాల్ వెల్లడి
మిలన్(ఇటలీ): స్పెషాలిటీ కెమికల్ కంపెనీ అనుపమ్ రసాయన్ తాజాగా ఫార్మాస్యూటికల్స్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు ఇటీవలే కొనుగోలు చేసిన బ్లిస్ జీవీఎస్ ఫార్మా సహకరించనున్నట్లు కంపెనీ సీఈవో గోపాల్ అగర్వాల్ పేర్కొన్నారు. వెరసి మూడేళ్లలో ఫార్మా నుంచి ఆదాయంలో మూడో వంతు సాధించనున్నట్లు అంచనా వేశారు. బ్లిస్ జీవీఎస్ ద్వారా తుది ఔషధాలు(ఫినిషిడ్ డోసేజీ)తోపాటు.. కాంట్రాక్ట్ తయారీ (సీడీఎంవో) సర్వీసులను సైతం అందించనున్నట్లు వెల్లడించారు. దీంతో యూఎస్, యూరప్‌లలో ఫార్మా కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు.
ప్రస్తుతం స్వేచ్చా సప్లై చైన్‌కు కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రస్తావించారు. ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల ఫార్మాస్యూటికల్ బిజినెస్ టు బిజినెస్ సదస్సు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో గోపాల్ కంపెనీ ప్రణాళికలు వెల్లడించారు. గుజరాత్ నుంచి ఆగ్రోకెమికల్స్ సరఫరాదారుగా ప్రారంభమైన లిస్టెడ్ కంపెనీ అనుపమ్ రసాయన్ గత ఐదేళ్లలో ఫార్మాలోకి ప్రవేశించడం ద్వారా రూ. 300 కోట్ల అమ్మకాలు సాధిస్తోంది. ప్రధానంగా చైనా దిగుమతులకు పోటీగా కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్‌ఎంలు) తయారు చేస్తోంది. వెరసి ప్రస్తుతం ఫార్మా విభాగం ద్వారా ఆదాయంలో 20 శాతంవరకూ అందుకుంటోంది.
బ్లిస్ జీవీఎస్‌తో స్పీడ్
ఫార్మా కంపెనీ బ్లిస్ జీవీఎస్‌ను రూ. 1,750 కోట్లకు అనుపమ్ రసాయన్ సొంతం చేసుకుంది. తద్వారా ఫినిష్‌డ్ డోసేజీ సామర్థ్యాలను అందిపుచ్చుకుంది. దీంతో ఒకే గొడుగుకింద కేఎస్‌ఎంలు, ఇంటరి్మడియెట్స్, ఏపీఐ, ఫార్ములేషన్లు రూపొందించగల కంపెనీగా ఆవిర్భవించినట్లు గోపాల్ వివరించారు. తొలుత యూఎస్‌లో విస్తరించడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. తదుపరి యూరప్, జపాన్‌లవైపు దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు.
ఆఫ్రికాలో అత్యధికంగా బిజినెస్ నిర్వహిస్తున్న బ్లిస్ కేవలం 30 శాతం సామర్ధ్యాన్నే వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో రెండేళ్లలో 70–80 శాతానికి సామర్థ్య వినియోగాన్ని పెంచుకునే వీలున్నట్లు తెలియజేశారు. బ్లిస్ ప్లాంట్లు ఇప్పటికే యూఎస్ ఎఫ్‌డీఏ, ఈయూ జీఎంపీ సరి్టఫికేషన్లు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని ప్రొడక్టులకు అనుమతులు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది యూఎస్‌లో సీడీఎంవో, తయారీ అమ్మకాలు ప్రారంభం కాన్నుట్లు తెలియజేశారు. గతేడాది(2025–26)లో బ్లిస్ రూ. 1,000 కోట్ల ఆదాయం అందుకున్నట్లు ప్రస్తావించారు.
ఈ ఏడాది రూ. 1,200–1,300 కోట్ల టర్నోవర్‌కు వీలున్నట్లు అంచనా వేశారు. బ్లిస్ జీవీఎస్ లిస్టెడ్ కంపెనీ కావడంతో ఆదాయ అంచనాలు ప్రకటించలేమని, గత ఆరు నెలల్లో 23–24 శాతం నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు సాధించినట్లు వెల్లడించారు. అనుపమ్ వివిధ దశలలో ఉన్న 90–100 మాలిక్యూల్స్‌ను కలిగి ఉంటే, అనుబంధ సంస్థలు బ్లిస్, జేహాక్, టాన్‌ఫాక్ సైతం 60–70 మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఏడాదికి 8–10 ప్రొడక్టులను వాణిజ్య ప్రాతిపదికన ప్రవేశపెడుతున్నట్లు తెలియజేశారు. బ్లిస్ 4–5 ప్రొడక్టులను విడుదల చేయనున్నదని, దీంతో ఆగ్రోకెమికల్స్ వృద్ధిని ఫార్మా విభాగం అధిగమించనున్నట్లు తెలియజేశారు.


