
వాట్సాప్ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్‌లైన్ కమ్యునికేషన్ యాప్ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్‌లోడ్ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్‌లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్‌లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట్ఫామ్లోకి ఆయనను ఆహ్వానించింది.
దీనిపై కంపెనీ చీఫ్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్‌కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్‌లో ఒక సభ్యుడు ఈ ట్వీట్‌ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.
ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..