
హైదరాబాద్: తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్‌ఎస్ ఇండియా) వెల్లడించింది. ఆప్టిగల్ ప్రైమ్, ఆప్టిగల్ పినకిల్ వీటిలో ఉన్నట్లు వివరించింది.
తుప్పు నుంచి మూడు రెట్లు అధిక రక్షణ కల్పించేలా ఇవి ఆరు వేరియంట్స్‌లో ఉంటాయి. దేశీయంగా, ముఖ్యంగా దక్షిణాదిన కలర్ కోటెడ్ ఉక్కు ఉత్పత్తుల విభాగంలో గణనీయంగా మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ డైరెక్టర్ రంజన్ ధర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ మార్కెట్ 3.4 మిలియన్ టన్నులుగా ఉండగా, దక్షిణాది మార్కెట్ వాటా సుమారు 0.6 మిలియన్ టన్నులుగా ఉంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ కంపెనీకి ఇన్నోవేషన్ లీడర్‌షిప్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీప్‌టెక్ ఆవిష్కరణలతో పంటల సంరక్షణ ఉత్పత్తులపై కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ లీడర్‌షిప్ అవార్డ్ పురస్కారం లభించినట్లు ఏటీజీసీ బయోటెక్ సంస్థ వెల్లడించింది. అగ్రికల్చర్ టుడే నిర్వహించిన 16వ అగ్రికల్చర్ లీడర్‌షిప్ సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ దీన్ని ప్రదానం చేసినట్లు వివరించింది.
తమ సంస్థకు 26 పేటెంట్లు, 50కి పైగా ఉత్పత్తులు ఉన్నట్లు కంపెనీ చైర్మన్ మార్కండేయ గోరంట్ల, ఈడీ వీబీ రెడ్డి తెలిపారు. బియ్యం, పత్తి తదితర పంటల్లో ఫెరోమోన్ టెక్నాలజీని విస్తరించడంలో తమ కంపెనీని కేస్ స్టడీగా పరిగణించవచ్చని 2024లో ప్రపంచ ఆర్థిక ఫోరం సైతం సూచించినట్లు పేర్కొన్నారు.
ఎన్‌ఎండీసీ గనులకు 5 స్టార్ రేటింగ్
మైనింగ్ దిగ్గజం ఎన్‌ఎండీసీకి చెందిన గనులకు ప్రతిష్టాత్మక 5 స్టార్ రేటింగ్ లభించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను చత్తీస్‌గఢ్‌లోని మూడు ఇనుప ఖనిజ గనులకు, కర్ణాటకలోని ఒక గనికి ఇది లభించినట్లు సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. పర్యావరణ అనుకూల విధంగా మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ముఖర్జీ చెప్పారు. కేంద్ర గనుల శాఖ, ఐబీఎం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందించారు.