అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. భారత్‌లోనూ ప్రభావం | Amazon Layoffs announced fresh jobs cut Indian Employees Hit | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. భారత్‌లోనూ ప్రభావం

Oct 8 2026 5:13 PM | Updated on Oct 8 2026 5:20 PM

Amazon Layoffs announced fresh jobs cut Indian Employees Hit

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి. కంపెనీ ప్రధాన ఆన్‌లైన్‌ షాపింగ్‌ కార్యకలాపాలను నిర్వహించే స్టోర్స్‌ విభాగంలో 1,000 మందిలోపు వైట్‌కాలర్‌ ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. అమెరికా, భారత్‌, బ్రిటన్‌లోని ఉద్యోగులు తాజా పునర్వ్యవస్థీకరణలో ప్రభావితమైనట్లు రాయిటర్స్‌ తెలిపింది. అయితే భారత్‌లో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారనే విషయాన్ని అమెజాన్‌ వెల్లడించలేదు.

తాజా కోతలు కస్టమర్‌ సర్వీస్‌, సెల్లింగ్‌ పార్ట్‌నర్‌ సర్వీసెస్‌, మార్కెట్‌ప్లేస్‌ సపోర్ట్‌, రిటైల్‌ ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఉన్నట్లు అంతర్గత సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్‌, బిజినెస్‌ ఇన్‌సైడర్‌ నివేదించాయి. ఈ సమయంలో అమెజాన్‌ అమెరికాలో ‘ప్రైమ్‌ బిగ్‌ డీల్‌ డేస్‌’ సేల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత్‌లోనూ పండుగల షాపింగ్‌ సీజన్‌ కొనసాగుతున్న సమయంలోనే తాజా ఉద్యోగ కోతలు వెలుగులోకి వచ్చాయి.

‘వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు’

ఉద్యోగ కోతలను అమెజాన్‌ ధ్రువీకరించినప్పటికీ, వీటిని ‘తక్కువ సంఖ్యలో’ ఉద్యోగాల తొలగింపుగా పేర్కొంది. స్టోర్స్‌ వ్యాపారంలోని కొన్ని విభాగాల నిర్మాణాన్ని మార్చామని, కొత్త వ్యవస్థ తమ ప్రస్తుత ప్రాధాన్యతలను మరింత సమర్థంగా అమలు చేయడానికి దోహదపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రభావిత ఉద్యోగులకు పరివర్తన సమయంలో సహాయం అందిస్తామని పేర్కొన్నారు.

బెజోస్‌ ఏమన్నారంటే.. 
అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) తాజా వ్యాఖ్యల్లో కొవిడ్‌ మహమ్మారి సమయంలో కంపెనీ భారీగా నియామకాలు చేపట్టిందని చెప్పారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున కొనుగోళ్లు చేయడంతో అమెజాన్‌ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆ కాలం తర్వాత సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నామని ఆయన వివరించారు.

అమెజాన్‌ గత ఏడాది అక్టోబర్‌లోనూ తన కార్పొరేట్‌ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 14,000 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థాగత స్థాయిలను తగ్గించడం, బ్యూరోక్రసీని కుదించడం, కీలక ప్రాధాన్యతలకు వనరులను మళ్లించడం ఈ చర్యల ఉద్దేశమని అప్పట్లో తెలిపింది.

అనంతరం 2026 జనవరిలో మరో 16,000 పాత్రలను తొలగించింది. ఈ రెండు ప్రధాన దశల్లోనే దాదాపు 30,000 ఉద్యోగాలపై ప్రభావం పడింది. జనవరి కోతల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కొత్త నియామకాలు కొనసాగుతాయని, అమెరికాలోని ఎక్కువ మంది ప్రభావిత ఉద్యోగులకు అంతర్గతంగా మరో ఉద్యోగం వెతుక్కోవడానికి 90 రోజుల సమయం ఇచ్చినట్లు అమెజాన్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement