
పరిశ్రమ నిపుణుల అంచనా
కోల్‌కతా: దేశీయంగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్‌లు, ఒడిదుడుకులతో అత్యధిక రాబడులను కోరుకునే ఫ్యామిలీ ఆఫీస్‌లు, కార్పొరేట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పరిశ్రమ నిపుణులు తెలిపారు. దీనితో ఈ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీల్లాంటివి ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేటగిరీలోకి వస్తాయి. 2025 మార్చి నాటికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్‌లోకి (ఏఐఎఫ్) రూ. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు హామీలు వచి్చనట్లు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్–టైమ్ సభ్యుడు అనంత నారాయణ తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.7 లక్షల కోట్లు అధికమని వివరించారు. గత అయిదేళ్లుగా చూస్తే ఏఐఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ హామీలు, పెట్టుబడులు వార్షికంగా 30 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఈ విభాగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000–40,000 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 నాటికి పది రెట్లు పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న అథా గ్రూప్ ప్రెసిడెంట్ విశాల్ విఠ్లానీ తెలిపారు. సంప్రదాయ ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాలతో పోలిస్తే అత్యధికంగా 16–18 శాతం ఈల్డ్‌లు అందిస్తూ, ఏఐఎఫ్‌లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.