అదానీ గ్రూప్‌పై అవే ఆరోపణలు | Sakshi
Sakshi News home page

అదానీ గ్రూప్‌పై అవే ఆరోపణలు

Published Fri, Sep 1 2023 4:54 AM

Adani, Mauritius-based fund deny allegations by OCCRP - Sakshi

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్‌పై మరోసారి అక్రమ పెట్టుబడుల ఆరోపణలు తలెత్తాయి. అదానీ ప్రమోటర్‌ కుటుంబం వెలుగులోలేని మారిషస్‌ ఫండ్స్‌ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోరి్టంగ్‌ ప్రాజెక్ట్‌(ఓసీసీఆర్‌పీ) తాజాగా ఆరోపించింది.

యూఏఈకి చెందిన నాసెర్‌ అలీ షాబాన్‌ అలీ, తైవాన్‌కు చెందిన చాంగ్‌ చుంగ్‌–లింగ్‌ ఏళ్లపాటు మారిషస్‌ ఫండ్స్‌ ద్వారా కోట్లాది డాలర్ల పెట్టుబడులతో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహించినట్లు ఓసీసీఆర్‌పీ తాజా ఆరోపణలకు తెరతీసింది. వినోద్‌ అదానీకి చెందిన వ్యక్తి నిర్వహణలోని దుబాయ్‌ సంస్థ ఈ ఫండ్స్‌ను నిర్వహిస్తుందని పేర్కొంది. కాగా.. ఇంతక్రితం ఈ ఏడాది జనవరిలోనూ అదానీ గ్రూప్‌ కంపెనీలలో అకౌంటింగ్‌ అవకతవకలు జరుగుతున్నట్లు యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీంతో గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలలో అమ్మకాలు వెల్లువెత్తి గ్రూప్‌ మార్కెట్‌ విలువలో 150 బిలియన్‌ డాలర్లమేర ఆవిరైంది. అయితే ఆపై గ్రూప్‌ వీటిని ఖండించింది. ఆపై షేర్ల ధరల్లో అవకతవకలకు  ఆధారాలు లేవంటూ సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆరోపణలను కొట్టివేసింది. తాజాగా ఓసీసీఆర్‌పీ ఆరోపణల నివేదికలో పేర్కొ న్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను ఇప్పటికే సుప్రీం కోర్టు నియామక కమిటీ దర్యాప్తులోనూ పరిగణించిన విషయాన్ని ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌ ప్రస్తావించింది. ఇవన్నీ రీసైకిల్‌ చేసిన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఇన్వెస్టర్‌ జార్జ్‌ సోరోస్‌ పెట్టుబడులున్న సంస్థల లబ్ది కోసం ఆరోపణలను తిరగతోడుతున్నట్లు వ్యాఖ్యానించింది. కొన్ని విదేశీ మీడియా వర్గాలు పసలేని హిండెన్‌బర్గ్‌ నివేదికను మరోసారి హైలైట్‌ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా వీటిని తోసిపుచి్చంది.  

తాజా ఆరోపణలు ఇలా..
2013–2018 మధ్య కాలంలో ప్రమోటర్‌ కుటుంబం తమ నిర్వహణలోని మారిషస్‌ ఫండ్స్‌ ద్వారా గ్రూప్‌ కంపెనీలలో కోట్లాది డాలర్ల నిధులను రహస్యంగా ఇన్వెస్ట్‌ చేశాయని ఓసీసీఆర్‌పీ పేర్కొంది. తద్వారా గ్రూప్‌ షేర్ల ధరలలో భారీ ర్యాలీకి కారణమైనట్లు ఆరోపించింది. ఈ కాలంలో షేర్ల ధరల్లో భారీ ర్యాలీ ఫలితంగా అదానీ గ్రూప్‌ దేశంలోనే అ త్యంత శక్తివంతమైన బిజినెస్‌ గ్రూప్‌లలో ఒకటిగా ఆవిర్భవించినట్టు పేర్కొంది.  ఓసీసీఆర్‌పీ  ఆరోపణలను అదానీ ఖండించినప్పటికీ అదానీ గ్రూప్‌ లోని పలు షేర్లు 4.4–2.2% మధ్య క్షీణించాయి.

అదానీపై విచారణకు జేపీసీ వేయాలి
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌
అదానీ గ్రూప్‌పై తాజా ఆరోపణల విషయంలో ప్రధాని మోదీ తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ దేశం ప్రతిష్ట మసకబారకుండా ఉండాలంటే అదానీ గ్రూప్‌పై జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ)తో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.  ఈ అంశంపై ప్రతిపక్ష పారీ్టలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అదానీ విషయంలో ఇండియా కూటమిలో ఎలాంటి విబేధాలు లేవన్నారు. ‘భారత్‌లో అందరికీ సమానావకాశాలుంటాయి. పారదర్శకత ఉంటుంది, అవినీతికి తావులేదని మనం చెప్పుకుంటున్నాం. కానీ, అదానీపై వస్తున్న ఆరోపణలు దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ప్రధానికి సన్నిహితుడైన ఈ పెద్ద మనిషి బిలియన్‌ డాలర్లతో షేర్‌ ధరలను పెంచేలా ఎలా చేయగలిగారు? ఆ సొమ్ము ఎవరిది? దీని వెనుక గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ హస్తం ఉందా?. ఇందులో మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉంది. వారు నాసిర్‌ అలీ షాబాన్, చైనా వాసి చాంగ్‌చుంగ్‌ లింగ్‌. ఈ విదేశీయులను ఈ వ్యవహారంలోకి ఎలా అనుమతించారు? వీటిపై విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీటన్నిటిపైనా ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి’అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ‘రుజువులు ఇచ్చినా సెబీ అదానీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. క్లీన్‌చిట్‌ ఇచ్చిన సెబీలోని ఆ పెద్దమనిషి ఇప్పుడు అదానీ ఎన్‌డీ టీవీలో డైరెక్టర్‌. ఎలాంటి విచారణ జరిగిందో దీన్నిబట్టి అర్థమవుతోంది’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement