ప్రథమ సంవత్సరంలో
ఇక వార్షిక పరీక్షలే
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం
తెలుగు మాధ్యమ విద్యార్థులకు
వెసులుబాటు
కరకగూడెం: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివి సాంకేతిక విద్య కోసం పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరుతున్న గ్రామీణ విద్యార్థులకు ఊరటనిచ్చింది. కోర్సులో చేరిన నాలుగున్నర నెలలకే ఆంగ్ల మాధ్యమంలో సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి రావడంతో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించింది. ప్రథమ సంవత్సరంలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని రద్దుచేసి, వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు ప్రైవేటు కళాశాలల్లో ప్రథమ సంవత్సరం చదువుతున్న సుమారు రెండు వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి..
పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుతున్న వారిలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు డిప్లొమా కోర్సులో చేరగానే ఆంగ్ల మాధ్యమంలోని బోధనను అర్థం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక అంశాలు, కొత్త పదజాలంపై పట్టు సాధించకముందే మొదటి సెమిస్టర్ పరీక్షలు రావడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల నుంచి వినతులు అందటంతో సాంకేతిక విద్యాశాఖ ప్రథమ సంవత్సరంలో వార్షిక పరీక్షల విధానానికి ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గి, పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు మాత్రం గతంలో మాదిరిగానే సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కాగా, ఫస్టియర్ వార్షిక పరీక్షలను 2027 ఏప్రిల్ 8 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నారు.


