తొలిగిన విఘ్నం! | - | Sakshi
Sakshi News home page

తొలిగిన విఘ్నం!

Nov 15 2026 1:32 PM | Updated on Nov 15 2026 1:32 PM

20 ఏళ్లుగా అడుగు ముందుకు..

రెండు అడుగులు వెనక్కు..

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అడుగులు

సానుకూలంగా వచ్చిన

ప్రీ ఫీజుబులిటీ నివేదిక!

ఇకపై రాష్ట్ర ప్రభుత్వ చొరవ,

కేంద్ర మద్దతే కీలకం

దశాబ్దాలుగా జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కల సాకారానికి 20 ఏళ్లుగా అడ్డుగా ఉన్న తొలి విఘ్నం ఎట్టకేలకు తొలగిపోయింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సుజాతనగర్‌–సీతంపేట గ్రామాల దగ్గర ఎంపిక చేసిన స్థలానికి సంబంధించి ప్రీ ఫీజుబులిటీ రిపోర్టు సానుకూలంగా వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సంకేతాలు అందాయి. ఇక తదుపరి దశలో అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ఆ ఒక్కటి దాటాలి

సీతంపేట, సుజాతనగర్‌ల దగ్గర సుమారు 667 ఎకరాల స్థలానికి సమీపం నుంచి భద్రాచలంరోడ్‌ – సత్తుపల్లి రైల్వే మార్గం వెళ్తోంది. దీంతో విద్యుత్‌ రైళ్లు నడిచేందుకు ఉపయోగించే హై వోల్టేజ్‌ విద్యుత్‌ వల్ల ఏర్పడే ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఎఫెక్ట్‌ కారణంగా ఏవియేషన్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఇబ్బందులు రాకుండా అనుసరించాల్సిన షీల్డింగ్‌ టెక్నాలజీపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ అంశంపై స్పష్టత వస్తే ప్రీ ఫీజుబులిటీతోపాటు టెక్నికల్‌ ఇబ్బందులు కూడా దాదాపు తొలగినట్టు అవుతుంది.

కీలక దశలు

సైట్‌ క్లియరెన్స్‌, టెక్నికల్‌ ఫీజుబులిటీ అంశాల్లో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చాక విమాన నిర్వహణకు సంబంధించిన అంశాల్లో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత గగనతల వినియోగం విషయంలో రక్షణ శాఖ నుంచి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి తర్వాత కేంద్రం నుంచి సూత్రప్రాయ అనుమతి వస్తుంది. అక్కడి నుంచి భూసేకరణ, టర్మినల్‌, రన్‌వేల నిర్మాణ వ్యయాలు తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదరాలి. చివరి దశలో పర్యావరణ అనుమతులు, విమానాలు వచ్చి పోయేందుకు లైసెన్సుల జారీ వంటి ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సమన్వయం సాధిస్తేనే

ఎయిర్‌పోర్టు నిర్మాణ విషయంలో కేంద్రం మూడు రకాల విధానాలను అమలు చేస్తోంది. ప్రైవేటు సంస్థలు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ముందుకు వస్తే వాటికే నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగిస్తోంది. ఇలా జరగాలంటే ఆ ఎయిర్‌పోర్టుకు ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండాలి. రద్దీ తక్కువగా ఉండే ట్రైర్‌ 2, 3 నగరాల్లో ఉడాన్‌ పథకం కింద ఎయిర్‌పోర్టులను కేంద్రమే నిర్మిస్తోంది. ఈ రెండు కాకుండా ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే, అనుమతులు జారీచేయడం, అరకొర ఆర్థిక సాయానికే కేంద్రం పరిమితమవుతోంది. ఆరంభంలో కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలు కేంద్రం నుంచి వచ్చినా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్లనే ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. దీంతో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కల సాకారం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

కొత్తగూడెం ఎయిర్‌పోర్టు అంశం గడిచిన రెండు దశాబ్దాలుగా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొలిసారిగా 2006లో ప్రతిపాదనలు వచ్చాయి. అప్పటి నుంచి వేర్వేరు స్థలాలను పరి శీలించారు. స్థానికంగా ఉన్న ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పొంగిపొర్లే వాగులు, నేల స్వభావం వంటి భౌగోళిక పరిస్థితులకు తోడు ఇక్కడ వెలసిన భారీ పరిశ్రమలు అడ్డుగా నిలిచా యి. ఫలితంగా అనేక ప్రతిపాదనలు ఆరంభంలోనే అటకెక్కాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు స్థాపనకు అనువుగా ఉన్న స్థలాల వివరాలు, సానుకూల అంశాలను పేర్కొంటూ ముందస్తుగా నివేదిక తయారు చేయించింది. దీని ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) టెక్నికల్‌ టీమ్‌ గత జూన్‌లో జిల్లాలో పర్యటించింది. స్థానిక పరిస్థితులు, ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను బేరీజు వేసింది. చివరకు సుజాతనగర్‌ –సీతంపేట గ్రామాల మధ్య ఉన్న 667 ఎకరాల స్థలం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువుగా ఉన్నట్టు తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విమానయాన శాఖ నుంచి సైట్‌ క్లియరెన్స్‌ సమాచారం అందినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement