రుద్రంపూర్: సింగరేణి కార్మికుల అలియాస్ పేరు మార్పు ప్రక్రియలో కదలిక రావడంతో హర్షం వ్యక్తమవుతోంది. కార్మికులు వివిధ కారణాలతో ఇంటి వద్ద ఒక పేరు, సంస్థలో మరో పేరుతో కొనసాగుతున్నారు. దీంతో అలియాస్ పేరు మార్పు సమస్య పరిష్కరించాలని పలుమార్లు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో లీగల్‌గా ఇబ్బందులు లేకుండా పేరు, ఇంటి పేర్ల, తదితర తప్పిదాలను సరిచేసేందుకు యాజమాన్యం ఉపక్రమించింది. గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులతో కమిటీ అధికారులు సమావేశమై అభిప్రాయాలు సేకరించింది. గత నెలలో కూడా యూనియన్ నాయకులతో యాజమాన్యం చర్చలు జరిపింది. ప్రక్రియ సాఫీగా సాగితే త్వరలో సుమారు 150 మంది అలియాస్ పేర్ల అభ్యర్థుల సమస్య పరిష్కారం కానుంది. ఈ చర్చల్లో గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సెక్రటరీ కొరిమి రాజ్‌కుమార్, ప్రాతినిధ్య సంఘం నాయకుడు ఆల్బర్ట్, జీఎంలు దేవేందర్ (సీపీపీ), వీవీ కిరణ్‌కుమార్ (ఐఆర్‌పీఎం), కే. అజయ్‌కుమార్ (జీఎం వెల్ఫేర్) తదితరులు పాల్గొన్నారు.


