అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
● ఓటరు నమోదుకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో అవకాశం ● వచ్చేనెల 6వ తేదీ వరకు గడువు
అశ్వారావుపేటరూరల్: ఖమ్మం–నల్లగొండ– వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కొద్ది నెలల్లో ఎన్నిక జరగనుంది. ఈమేరకు అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునే గడువు వచ్చేనెల 6వ తేదీ వరకు ఉంది. ఇప్పటికే పార్టీల వారీగా అభ్యర్థులు ప్రచారం చేస్తూనే పట్టభద్రులతో ఓటర్లుగా నమోదు చేయించడంలో నిమగ్నమయ్యారు. కొందరు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి ఉచితంగా నమోదు చేస్తామని చెబుతున్నారు. అయితే, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు మళ్లీ ఈసారి కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఆన్‌లైన్, ఇటు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున పట్టభద్రులు ముందుకు రావాలని అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది.
●ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా సమాన అర్హత కలిగిన కోర్సు పూర్తిచేసి ఉండాలి.
●డిగ్రీ పూర్తిచేసి ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి మూడేళ్లు నిండిన వారు అర్హులు.
●ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధి నివాసి అయి ఉండాలి.
●ఓటరుగా నమోదు కావడానికి ఆన్‌లైన్‌లో ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా దరకాస్తు నింపి బీఎల్‌ఓ / ఎన్నికల డీటీకి సమర్పించాల్సి ఉంటుంది.
●దరఖాస్తుతోపాటు డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్, ఓటరు కార్డు(పాత కార్డు ఉంటే) జతపరచాలి.
●దరఖాస్తు పత్రాలపై ధ్రువీకరణకు గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి.
అర్హులైన పట్టభద్రులంతా బాధ్యతగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓటరుగా నమోదైన పట్టభద్రులే కాక మూడేళ్ల క్రితం డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు నమోదు చేయించుకోవాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా తహసీల్దార్ కార్యాలయం లేదా స్థానిక బీఎల్‌ఓను సంప్రదించవచ్చు.
– ఎస్.కే.హుస్సేన్, ఎన్నికల డీటీ, అశ్వారావుపేట


