ఆ స్థానంలో సీతారామ ప్రాజెక్ట్..
డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ దశలో నిర్మాణం
రెండు దశాబ్దాల్లో వరి పంట స్థానం ఆక్రమించిన పామాయిల్ సాగు
భూ సేకరణపై సత్తుపల్లి,
అశ్వారావుపేట రైతుల విముఖత
సీతారామ ఇంజనీర్ల ముందు పైపులైన్ల ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణంపై అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి జలాలను అప్పటి సత్తుపల్లి నియోజకర్గానికి అందించే లక్ష్యంతో ఇందిరాసాగర్ ప్రాజెక్ట్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయితే అప్పటి సత్తుపల్లి నియోజకవర్గంలో కొత్తగా 1.43 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నీరు అందేది. మరో లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఇందిరాసాగర్‌తోపాటే ప్రారంభమైన రాజీవ్ సాగర్ ప్రాజెక్టు కూడా రద్దయింది. పదేళ్ల తర్వాత 2016లో సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించారు. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ నిర్మాణం పూర్తయింది. దీనికోసం 1,737 ఎకరాల స్థలం అవసరమవగా ఇందులో ఫారెస్ట్ భూములే 1,202 ఎకరాలు ఉంది. దీంతో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. యాతాలకుంట టన్నెల్ అందుబాటులోకి రావడంతో డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మిస్తే సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని సాగు భూముల్లో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పారే అవకాశం కలిగింది. కానీ, ఇక్కడే కొత్త సమస్య ఎదురైంది.
మారిన పరిస్థితులు
గడిచిన 20 ఏళ్లలో అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ వరి స్థానాన్ని పామాయిల్ భర్తీ చేసింది. ఈ రెండు నియోజకర్గాల్లోనే దాదాపు లక్షన్నర ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. గడిచిన మూడేళ్లుగా పామాయిల్ సాగు ద్వారా ఇక్కడి రైతుల ఆదాయాలు కూడా పెరగడం మొదలైంది. ఈ సమయంలో సీతారామ డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ భూసేకరణకు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
రీ చార్జ్ చేయండి
వరి తరహాలో ఎక్కువ మొత్తంలో నీరు నిలిస్తే పామాయిల్ సాగుకు ఇబ్బంది ఉంటుంది. ఆరుతడి పంటల తరహాలో తక్కువ స్థాయిలో నీరుంటే దిగుబడి సరిగా రాదు. పామాయిల్ మొక్క/చెట్టు మొదలు దగ్గర ఎళ్ల వేలలా తడి ఉండాలి. అందుకోసం డ్రిప్, స్ప్రింకర్లను రైతులు ఉపయోగిస్తున్నారు. దీనికోసం భూగర్భ జలాలు, విద్యుత్ మోటార్లను ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యేలా చెరువులు, ఇతర జలాశయాలను గోదావరి జలాలతో నింపితే సరిపోతుందని ఎక్కువ మంది రైతులు అభిప్రాయపడుతున్నారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు పామాయిల్ తోటల మధ్యలో నుంచి వెళితే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొందరు రైతులు తమ స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వగా, మరికొందరు గ్రామ సభల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు.
మొర ఆలకిస్తారా ?
డిస్ట్రిబ్యూటరీ కాలువల విషయంలో రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలపై మంత్రి తుమ్మల స్పందించారు. కాలువలకు బదులు పైప్‌లైన్ల ద్వారా గోదావరి జలాల తరలింపు అంశాన్ని పరిశీలించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించారు. తద్వారా 9,767 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదని, ప్రభుత్వ ఖజానాపై భారం కూడా పడదని చెప్పారు. ఈ ప్రతిపాదనపై సీతారామ ఇంజనీర్లు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
20 ఏళ్ల క్రితం మొదలైన ఇందిరా సాగర్ ఎత్తిపోతల పనులు


