పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి సువర్ణ పుష్పార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనక దుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్‌కుమార్‌, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

ఆదర్శనీయుడు

పండుగ సాయన్న

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి భావి తరాలకు ఆదర్శమని కలెక్టరేట్‌ ఏఓ అనంత రామకృష్ణ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ సాయన్న సమాజంలో అణగారిన వర్గాలు, అన్యాయాలు, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి విజయలక్ష్మి, బీసీ సంఘ నాయకులు ఎస్‌.క్రాంతి, బండారి సాగర్‌, అక్కల మధు, అక్కల సీతారామయ్య, కె పైడయ్య, ఊదర వెంకటస్వామి, ఎ సోమయ్య, హారిక, ఉషారాణి, జి సంధ్యారాణి, ఎం.కిషోర్‌, కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో..

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): హేమచంద్రాపురంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ తదితరులు సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్‌ఐలు లాల్‌బాబు, నరసింహారావు, కృష్ణారావు, ఆర్‌ఎస్‌ఐలు హరీష్‌, శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

రేపు ఫుట్‌బాట్‌ ఎంపికలు

రుద్రంపూర్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బాలబాలికల ఫుట్‌బాట్‌ జట్ల ఎంపికలను ఈ నెల 24న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 01.01.2009 నుంచి 31.12.2011 లోపు జన్మించిన బాలబాలికలు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.

31 నుంచి రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌ : హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన జూనియర్స్‌ విభాగంలో రాష్ట్రస్థాయి బాలికల హ్యాండ్‌బాల్‌ టోర్నీ ఈనెల 31నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు పోటీల బ్రోచర్లను ఖమ్మంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో గురువారం కాంగ్రెస్‌ నాయకుడు తుమ్మల యుగంధర్‌ ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో పోటీలు జరగనుండగా, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ, ఒలింపిక్‌ అసోసియేషన్‌ సహకారం అందిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖాదర్‌ బాబా, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వరికూటి మోహన్‌తో పాటు హన్మంతరావు, కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement