దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చివెళ్తున్నవారికి అవస్థలు
రద్దీకి తగిన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ
బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న ప్రయాణికులు
చుంచుపల్లి: దసరా పండుగను సొంతూళ్లలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్న ప్రజలకు తిరుగు ప్రయాణం మాత్రం అవస్థలను మిగిల్చింది. సెలవులు ముగియడంతో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. బుధ, గురువారాల నుంచి కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, మధిర, సత్తుపల్లి, ఖమ్మం వంటి ప్రధాన బస్టాండ్లలో రద్దీ నెలకొంది. అయినా తగిన సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పిల్లాపాపలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పండుగ ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ చేసిన ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు ఎదురవుతున్న పరిస్థితులకు పొంతన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సరిపోని ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా సందర్భంగా ఖమ్మం రీజియన్ పరిధిలో 1,642 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు పండుగ ముందుగానే ప్రకటించారు. పండుగ అనంతరం ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాల కోసం 733 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. వీటిలో 405 రిజర్వేషన్ సర్వీసులు ఉండగా, రోజువారీగా నడిచే 145 సాధారణ షెడ్యూల్ సర్వీసులు ఉన్నాయి. తిరుగు ప్రయాణాల కోసం ఖమ్మం డిపో నుంచి 216, సత్తుపల్లి నుంచి 140, భద్రాచలం నుంచి 132, మధిర నుంచి 102, కొత్తగూడెం నుంచి 57, మణుగూరు నుంచి 50, ఇల్లెందు నుంచి 36 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించారు. ఈ ఏడు డిపోల నుంచి మొత్తం 733 ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే రద్దీ పెరిగిన సమయంలో సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులకు అదనపు చార్జీల మీద ఉన్న శ్రద్ధ ప్రయాణికుల శ్రేయస్సు మీద లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రధాన బస్టాండ్లలో రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


