తాగునీటికి ఇబ్బంది రాకుండా..
ఇసుక బస్తాలతో ‘కాటన్’ ఆనకట్ట
ఎత్తు పెంపునకు నిర్ణయం
అదనంగా ఒక టీఎంసీ నీటి నిల్వకు అవకాశం
ఫలితంగా వేసవిలో నీటి ఎద్దడికి చెక్
సర్ ఆర్డర్ కాటన్ హయాంలో..
గోదావరిపై అశ్వాపురం – దుమ్ముగూడెం మధ్య 1564.50 మీటర్ల పొడవుతో 150ఏళ్ల క్రితం సర్ ఆర్దర్ కాటన్ నేతృత్వాన ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట డెడ్ స్టోరేజీ లెవల్ 36 మీటర్లు ఉండగా గరిష్ట ఎత్తు 49.50 మీటర్లుగా ఉంది. గోదావరి నదికి 35వేల క్యూసెక్కుల వరద వస్తే అలుగు పోసేలా ఈ ఆనకట్టను డిజైన్ చేశారు. అంటే ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 6 టీఎంసీలుగా ఉండేది. ఈ ఆనకట్ట ఆధారంగానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఇళ్లకు మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది.
డేంజర్ బెల్స్
గోదావరిపై కాటన్ ఆనకట్ట దిగువన నిర్మించతలపెట్టిన సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. సీతమ్మసాగర్ అందుబాటులోకి వస్తే 36 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఎల్‌నినో వంటి కఠిన పరిస్థితులు వచ్చినా వేసవిలో తాగునీటికి ఇబ్బంది ఉండేది కాదు. ఇది జరగకపోగా... ఆనకట్ట ఎగువ భాగాన పేరుకుపోయిన పూడిక, ఇసుక మేటల కారణంగా నీటి నిల్వ సామర్థ్యం 6 టీఎంసీల నుంచి 1.25 టీఎంసీలకు పడిపోయింది.
గుక్కెడు నీళ్లకు చిక్కులే
ప్రస్తుతం కాటన్ ఆనకట్ట నుంచి ప్రతీరోజు 150 ఎంఎల్‌డీ నీటిని తాగు అవసరాలకు సరఫరా చేస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం నిల్వ ఉన్న 1.20 టీఎంసీల నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తే ఎనిమిది నెలల వరకు ఇబ్బంది ఉండదు. కానీ ఒక్కసారి ప్రవాహం తగ్గిపోయి, వేసవి తాపం మొదలైందంటే నెల వ్యవధిలోనే 1.20 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ సామర్థ్యం డెడ్ స్టోరేజీ లెవల్ 0.45 టీఎంసీలకు పడిపోయే అవకాశముంది. తద్వారా ఫిబ్రవరి, మార్చి నాటికే తాగునీటికి కటకట ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సాగు, పారిశ్రమిక రంగాల విషయం ఆలోచించే పరిస్థితి ఉండదు. దీంతో ముందు జాగ్రత్తగా వేసవిలో తాగునీటి ఇబ్బంది రాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో తాత్కాలికంగా ఇసుక బస్తాలతో ఆనకట్ట ఎత్తు పెంపు ప్రణాళిక అమలుకు సిద్ధమయ్యారు.
ఎత్తు పెంపు ఇలా
దుమ్ముగూడెం వైపు రవాణా కెనాల్ నుంచి 209.10 మీటర్ల వరకు ఆనకట్ట ఎత్తును 1.50 మీటర్ల ఎత్తు పెంచాలని నిర్ణయించారు. అదే విధంగా అశ్వాపురం వైపు 1,355.40 మీటర్ల మేరకు ఒక మీటర్ మేర కరకట్ట ఎత్తు పెంచనున్నారు. తద్వారా ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 1.25 టీఎంసీల నుంచి 2.25 టీఎంసీలకు పెరిగే అవకాశం ఉంది. ఒక టీఎంసీ నీటిని అదనంగా నిల్వచేయడం ద్వారా రాబోయే వేసవిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్ జిల్లాలోని లక్ష లాది ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని ఆటంకాలు లేకుండా సరఫరా చేసే వీలు ఏర్పడుతుంది.
నవంబర్‌లో మొదలు
ఇసుక కట్టల ద్వారా కాటన్ ఆనకట్ట ఎత్తును తాత్కాలికంగా పెంచేందుకు రూ.1.25 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లా ఇరిగేషన్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. నిధుల కేటాయింపుతో పాటు సాంకేతిక శాఖ అనుమతులు లభించాల్సి ఉంది. మొత్తంగా నవంబర్ మొద టి వారంలో ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, దసరా ముహూర్తాన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేతృత్వాన పనులను మంగళవారంలాంఛనంగా మొదలుపెట్టారు. ఇదంతా బాగానే ఉన్నా ఆనకట్ట తాత్కాలిక ఎత్తు పెంపుతో ముంపు ముప్పు ఏ మేరకు ఉంటుందనే సందేహాలు గోదావరి తీర ప్రాంత వాసుల్లో ఉన్నాయి.
అశ్వాపురం: ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున, ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు గోదావరి జలాల నిల్వ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. దుమ్ముగూడెం ఆనకట్టపై ఫ్లాష్‌బండ్ (సాండ్ బ్యాగింగ్) పనులకు ఎమ్మెల్యే విజయదశమి సందర్భంగా మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. సాండ్ బ్యాగింగ్ ద్వారా వృథాగా వెళ్లే 0.90 టీఎంసీల గోదావరి జలాలను అదనంగా నిల్వ చేయొచ్చని, తద్వారా వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా సరఫరా చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పనులు పూర్తయితే మూడు జిల్లాలకు తాగునీరే కాకుండా భారజాల కర్మాగారానికి, 11 ఎత్తిపోతల పథకాలకు సాఫీగా నీరు అందుతుందని చెప్పారు. నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, రమేష్, సర్పంచ్‌లు, నాయకులు కోర్సా కృష్ణ, ఇర్పా కవిత, ఓరుగంటి రమేష్‌బాబు, గాదె కేశవరెడ్డి, ఊసా అనిల్‌కుమార్, వేములపల్లి రమేష్, శీలం సంజీవరెడ్డి, మేకల అంజిబాబు, జామా ఖాదర్‌బాబా, ఐర్పా లక్ష్మణ్, కాకా రాములు, బట్టా సత్యనారాయణ, బారాజు సంపత్, లంకమల్ల కొండలరావు, గాదె వెంకటరెడ్డి పాల్గొన్నారు.
కఠినమైన ఎల్‌నినో పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేలా యంత్రాంగం సిద్ధమవుతోంది.
జలాశయాల్లో నీరు అడుగంటుతుండడం, భూగర్భ జలాలు కూడా పడిపోతుండడంతో రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా గోదావరిపై అశ్వాపురంలోని దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


