అశ్వారావుపేటరూరల్: పూత దశలో ఉన్న కంది పంటను నరికివేసిన ఘటనపై గిరిజనులు ఆందోళనకు దిగారు. పాదయాత్రగా అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్ వచ్చి నిరసన తెలిపారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 30, 36, 39లో 573 ఎకరాలకు సంబంధించి 181 మంది రైతులతో పాటు ఎఫ్‌డీసీ, ఫారెస్టు అధికారుల మధ్య కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. ప్రస్తుతం కలెక్టర్ అంకిత్ అదేశాలతో ఆయా భూముల్లో రీసర్వే చేస్తున్నారు. అయితే, ఇదే సర్వే నంబర్లలోని నాలుగు ఎకరాల్లో రామన్నగూడెం గ్రామస్తులంతా ఉమ్మడిగా గత జూన్ నుంచి కంది పంట సాగు చేస్తున్నారు. పంట ప్రస్తుతం పూత దశలో ఉండగా, ఎకరం పంటను గుర్తుతెలియని వ్యక్తులు పూర్తిగా నరికివేశారు. ఈ విషయాన్ని బుధవారం గుర్తించిన గిరిజనులు అగ్రహం వ్యక్తం చేస్తూ నరికేసిన కంది పంటతో కాలినడకన అశ్వారావుపేట పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నా రు. ఘటనకు పాల్పడిన ఎఫ్‌డీసీ అధికారులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు, రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూతదశలో ఉన్న నరికివేయడంతో రూ. 60వేల మేర నష్టపోయామని వాపోయారు. అనంతరం ఎఫ్‌డీసీ అధికారులపై ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి నచ్చజెప్పడంతో గిరిజనులు తమ ఆందోళన విరమించి వెనుదిరిగారు.
ఎఫ్‌డీసీ అధికారుల పనేనని
గిరిజనుల ఆరోపణ


