● భద్రగిరిలో కనుల పండువగా రామ్‌లీలా మహోత్సవం ● శమీ పూజలు, ఆయుధార్చనలు ● పట్టాభిషక్తుడైన భద్రగిరి రామయ్య
భద్రాచలం: ఓ వైపు వేదమంత్రాల ఘోష.. మరోవైపు మంగళవాయిద్యాలు.. ఇంకోవైపు భక్తజనుల జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణతో భద్రాచలంలో విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పర్వదినాన్ని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం బుధవారం నిర్వహించిన శమీ పూజలు, ఆయుధార్చనలు, శ్రీరామలీలా మహోత్సవం, రావణాసుర వధ ఘట్టాలతో భద్రగిరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ముగిసిన పారాయణోత్సవాలు
విజయదశమిని పురస్కరించుకుని మారుతి సదనంలో నిర్వహిస్తున్న శ్రీరామ పారాయణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ప్రత్యేక పూజలు, యాగం అనంతరం మహా పూర్ణాహుతితో అర్చకులు ఉత్సవాలకు ముగింపు పలికారు. ప్రత్యేక వేదికపై కొలువుదీరిన స్వామివారి నిత్యకల్యాణ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కాగా, రామసేవా మండపంలో నిర్వహించిన స్వామివారి పట్టాభిషేక వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
శాస్త్రోక్తంగా శమీ, ఆయుధ పూజలు
ఆలయ అభివృద్ధి పనుల కారణంగా స్వామివారిని తిరువీధి సేవగా సంప్రదాయ దసరా మండపానికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆలయ ప్రాంగణంలోనే శమీ పూజ నిర్వహించారు. శమీ వృక్షం కొమ్మలను తీసుకొచ్చి అర్చకులు పుణ్యావాచనం, పూజ జరిపారు. స్వామివారి ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. రాముడి విజయగాథను స్మరిస్తూ అర్చకులు పండుగ విశిష్టతను వివరించారు.
శ్రీరామ్‌లీలా మహోత్సవం
స్వామివారి పాదుకలు, రామజ్యోతిని వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ దసరా మండపానికి తీసుకువచ్చారు. అక్కడ నిర్వహించిన శ్రీరామలీలా మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రావణాసురుడిపై శ్రీరాముడు విజయం సాధించిన ఘట్టాన్ని ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ఈఓ దామోదర్‌రావు రావణాసురుడి ప్రతిరూపంపై బాణం సంధించడంతో బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. భక్తుల శ్రీరామ నామస్మరణ, జయజయధ్వానాలతో దసరా మండపం మార్మోగింది. ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్, ఆలయ అర్చకులు, పండితులు పాల్గొన్నారు.


