సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలంలోని గోదావరి లాడ్జిలో పాల్వంచ హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పద్మశాలీ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. తన తండ్రి మృతికి కారణమైన బాధ్యులను శిక్షించాలని లక్ష్మీనారాయణ కుమార్తె కన్నీటిపర్యంతమయ్యారు. నిజాయితీపరుడైన లక్ష్మీనారాయణను జర్నలిజం ముసుగులో వేధింపులకు గురిచేసి బలవన్మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మశాలీ సంఘం నాయకులు కోరారు. స్పందించిన ఎస్పీ మాట్లాడుతూ విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు వైఎస్ రావు, గుండు రవికుమార్, వేముల ప్రసాద్ బాబు, వేముల సతీష్, వేముల మధుకర్, ఇమంది ఉదయ్ కుమార్, పుట్టా శంకరయ్య, తోటకూర శ్రీనివాసరావు, పిండిప్రోలు కన్నయ్య, దోమల కిషోర్, బొమ్మ రామకిషోర్, దోమల ప్రవీణ్, పెగడ శంకర్, ఆడెపు నాగరాజు, రాగిణి వెంకటేశ్వర్లు, వేల శివ, వేల జీవన్ తదితరులు పాల్గొన్నారు.


