టీబీ రహిత జిల్లా సాధనకు కృషి
● టీబీ ముక్త్ జన జాతీయ అభియాన్‌లో జిల్లా ఎంపిక ● తొలి విడతలో 371, రెండో విడతలో 350 గ్రామాల్లో పరీక్షలు ● ఊరిలోని జనాభా అందరికీ తప్పనిసరిగా పరీక్షలు ● అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో ప్రత్యేక శిబిరం
అశ్వారావుపేటరూరల్: ఏటా టీబీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. టీబీ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ‘టీబీ ముక్త్ జన జాతీయ అభియాన్’ పథకాన్ని అమలు చేస్తోంది. స్వచ్ఛంద సంస్థ సహకారంతో బాధితులను గుర్తించేందుకు విడతల వారీగా గ్రామాల్లో పరీక్షలు చేపడుతోంది. ఈ పథకానికి రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను ఎంపిక చేశా రు. జిల్లాలోని 23 మండలాల్లోని 371 గ్రామాలను తొలి విడత కింద ఎంపిక కాగా, రెండో విడతలో మరో 350 గ్రామాలకు అవకాశం దక్కింది.
వేదాంతపురం నుంచి శ్రీకారం..
తొలి విడత ఎంపికై న అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో ఈ నెల 18న ప్రత్యేక టీబీ శిబిరం ప్రారంభించారు. టీబీ వ్యాధి బాధితులు అధికంగా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వగా, తొలి రోజే ఈ గ్రామంలో ఏడుగురికి టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 19వ తేదీ నుంచి దమ్మపేట మండలం పట్వారీగూడెం, దుమ్ముగూడెం మండలంలోని గౌరారం గ్రామాల్లో కూడా ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభించినట్లు సంస్థ కోఆర్డినేటర్ హనుమంత్ నాయక్ తెలిపారు. కాగా, రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, అలసట, ఛాతీలో నొప్పి, రాత్రి సమయంలో చెమటలు పట్టడం, వంటి లక్షణాల కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది.
ప్రతీ ఒక్కరికీ పరీక్ష
ఎంపిక చేసిన గ్రామంలో పిరమల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తారు. ప్రతీ ఒక్కరికి టోకెన్ ఇచ్చి, పరీక్షించే సమయాన్ని ముందుగానే తెలుపుతారు. ఆ సిబ్బంది ద్వారా సంచార ఎక్స్‌రే, కిట్లు ద్వారా కల్లె పరీక్ష చేస్తారు. వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే బాధితులకు వైద్య సేవలు అందించి, వ్యాధి నివారణకు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారు.
టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఎంపిక చేసిన గ్రామాల్లో వైద్య బృందం, స్వచ్ఛంద సంస్థ ద్వారా వంద శాతం వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణయితే బాధితులకు వైద్య సేవలతోపాటు ఉచితంగా మందులు అందిస్తాం. – డాక్టర్ బానోతు ప్రసాద్,
జిల్లా క్షయ నియంత్రణ అధికారి


