భద్రాచలంటౌన్: గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూ, పర్యాటక రంగంలో వినూత్న ప్రాజెక్టుగా నిలిచిన భద్రగిరి మార్ట్‌కు రాష్ట్రస్థాయి పర్యాటక అవార్డు లభించింది. ‘బెస్ట్ ఇన్నోవేటివ్ టూరిజం ప్రాజెక్ట్ / ప్రొడక్ట్’ పురస్కారాన్ని శనివారం హైదరాబాద్‌లో జరిగిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అందుకున్నారు. గిరిజన మహిళలు తయారు చేసే ఆర్గానిక్, చిరుధాన్యాల ఉత్పత్తులకు భద్రగిరి మార్ట్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పించగా 100 మందికి పైగా మహిళలకు జీవనోపాధి లభిస్తోంది. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్ పాల్గొన్నారు.


