● రెడ్‌క్రాస్‌లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ● పదవులు పంచుకుని రాజీ పడిన ఇరువర్గాలు ● 28న చైర్మన్, వైస్‌చైర్మన్, ట్రెజరర్ ఎన్నిక
భద్రాచలం: జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు చివరకు ఏకగ్రీవమయ్యాయి. సుదీర్ఘ కాలం అనంతరం ఎన్నికలు జరుగుతాయని భావించినా నామినేషన్లు దాఖలు చేసిన రెండు వర్గాల నడుమ రాజీ కుదరడంతో కథ సుఖాంతమైంది. మేనేజింగ్ కమిటీని 15మందిని ఎన్నుకోవాల్సి ఉండగా.. పదవులను ఇరువర్గాలు పంచుకునేలా అవగాహనకు రావడంతో మిగతా వారిని పోటీ నుంచి తప్పించారు.
తొమ్మిది.. ఆరు చొప్పున పదవులు
రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఎన్నిక కోసం ఈనెల 24న నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ శనివారం గడువు శనివారంతో ముగియనుండడంతో ఇరువర్గాల వారు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఎన్నికలు అనివార్యమైతే వచ్చేనెల 4వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రెండు వర్గాల అభ్యర్థులు శనివారం భద్రాచలానికి చెందిన ఓ ప్రముఖుడి వద్ద రాజీ మంతనాలు సాగించారు. చివరకు మాజీ చైర్మన్ అభ్యర్థి వర్గానికి ఈసారి కూడా ఆరు మెంబర్ పదవులు, మరో వర్గానికి తొమ్మిది పదవులు ఇచ్చేలా నిర్ణయం జరిగింది. మొదటి వర్గానికి చైర్మన్ పదవి, రెండో వర్గానికి సెక్రటరీ, కోశాధికారి పదవి ఇచ్చేలా అంగీకారం కుదిరింది.
ఉపసంహరణలో ఉత్కంఠ
నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం మధ్యాహ్నం ముగియనుండడంతో భద్రాచలంలో పదవులపై ఒప్పందాలు కుదరగానే రెండు వర్గాల అభ్యర్థులతో ఉరుకులు, పరుగులపై కొత్తగూడెంలోని కలెక్టరేట్‌కు చేరారు. అక్కడ పోటీ పడుతున్న వారిని రప్పించి బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరింపజేశారు. దీంతో ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆశించిన పలువురు నిరాశకు లోనయ్యారు. అయితే, కొందరు వారి పదవుల కోసం తమను బలి పశువులుగా చేశారని వాపోయినట్లు సమాచారం. కాగా, మేనేజింగ్ కమిటీలో 15మంది పేర్లు ఖరారు కావడంతో ఈనెల 28న సోమవారం సమావేశమై ఇందులో నుంచి చైర్మన్, వైస్‌చైర్మన్, ట్రెజరర్, స్టేట్ కమిటీ మెంబర్లను ఎన్నుకుంటారు. కాగా, రెడ్‌క్రాస్ జిల్లా ప్రెసిడెంట్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు.


