పేరుకుపోతున్న ఉప ఉత్పత్తులు | - | Sakshi
Sakshi News home page

పేరుకుపోతున్న ఉప ఉత్పత్తులు

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

● అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో భారీగా నిల్వలు ● స్థానిక లారీలకు కిరాయి ఎక్కువంటున్నారని వ్యాపారుల వాదన ● గిట్టుబాటు కాకపోవడంతో పెంచాలని కోరుతున్న లారీ యజమానులు ● ఉప ఉత్పత్తుల తరలింపుపై నెలరోజులుగా ప్రతిష్టంభన

గిట్టుబాటు కావడంలేదని..

● అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో భారీగా నిల్వలు ● స్థానిక లారీలకు కిరాయి ఎక్కువంటున్నారని వ్యాపారుల వాదన ● గిట్టుబాటు కాకపోవడంతో పెంచాలని కోరుతున్న లారీ యజమానులు ● ఉప ఉత్పత్తుల తరలింపుపై నెలరోజులుగా ప్రతిష్టంభన

దమ్మపేట: అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలో ఉప ఉత్పత్తుల నిల్వలు గుట్టల మాదిరిగా పేరుకుపోతున్నాయి. వర్షాకాలం సీజన్‌ కావడంతో ఫ్యాక్టరీకి పామాయిల్‌ గెలల ఉధృతి పెరిగింది. ఈ నెలలో 21వ తేదీ వరకే సమారు 35 వేల మెట్రిక్‌ టన్నుల గెలలను క్రషింగ్‌ చేశారు. క్రషింగ్‌ అనంతరం వచ్చే పామాయిల్‌ గింజ పెంకులు, కెర్నల్‌ కేకు, డీమక్‌ పౌడర్‌ వంటివి ఉప ఉత్పత్తులు అధికంగా లభిస్తున్నాయి. అయితే ఇతర ప్రాంతాల లారీలను రానివ్వకపోవడం, ఇక్కడి లారీల యజమానులు, యూనియన్‌ బాధ్యులు అధిక ధర అడుగుతుండటంతో తరలించలేకపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు.

మంత్రి తుమ్మల ఆదేశించినా..

గత సోమవారం ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ప్రాంగణంలో పేరుకుపోయిన నిల్వలను గమనించి అధికారులను ప్రశ్నించారు. జిల్లా రవాణా శాఖ అధికారికి ఫోన్‌ చేసి లారీలను అడ్డుకుని, ఫ్యాక్టరీ ఉప ఉత్పత్తుల రవాణాను అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్మల ఫ్యాక్టరీకి వచ్చి లారీ యూనియన్‌ బాధ్యులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. ఇతర ప్రాంతాల లారీలను అడ్డుకోకపోవడంతో కొంతమేర ఉప ఉత్పత్తులను తరలిస్తున్నారు. అధికారులు చొరవ చూపి ఇరుపక్షాలతో పూర్తిస్థాయిలో చర్చించి రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.

ఉప ఉత్పత్తుల తరలింపునకు స్థానిక లారీలనే వినియోగించాలని యూనియన్‌ బాధ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను అడ్డుకుంటున్నారు. ఇక్కడి లారీల్లో తరలించేందుకు అంగీకరిస్తున్నా అధిక మొత్తంలో కిరాయి అడుగుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారులు ఇచ్చే ధర గిట్టుబాటు కావడంలేదని లారీల యజమానులు పేర్కొంటున్నారు. డీజిల్‌, ఇన్సూరెన్స్‌, విడి భాగాల ధరలు పెరిగిన నేపథ్యంలో లారీ కిరాయి కూడా పెంచాలని కోరుతున్నారు. కొన్ని రూట్లకు తరలిస్తున్నా, మరికొన్ని రూట్లలో తరలింపునకు గిట్టుబాటు కావడంలేదని లారీలు పెట్టడం లేదు. దీంతో పలువురు వ్యాపారులు నెల రోజులుగా రవాణాను నిలిపివేశారు. దీంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిల్వలు పేరుకుపోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement