సూపర్‌బజార్(కొత్తగూడెం)/భద్రాచలంఅర్బన్: జిల్లాకు నూతనంగా అదనపు ఐదు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులు మంజూరయ్యాయి. కొత్తగూడెం జిల్లా కోర్టులో మూడు, భద్రాచలం, మణుగూరుకు ఒక్కొక్కటి మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త కోర్టులను మంజూరు చేస్తూ న్యాయశాఖ ఈ నెల 24న జీఓ నంబర్ 59 జారీ చేసింది. అందులో జిల్లాకు ఐదు కేటాయించారు. భద్రాచలంలో ఇప్పటికే రెండు కోర్టులు ఉండగా, తాజాగా మూడో కోర్టు మంజూరైంది. కొత్తగూడెం జిల్లా కోర్టుకు మంజూరైన మూడింటిలో ఒకటి పాల్వంచలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు, ప్రజలు కోరుతున్నారు. నూతనంగా మంజూరైన కోర్టులకు త్వరితగతిన సదుపాయాలు కల్పించాలని, జిల్లాకు ఐదు కోర్టులు మంజూరు కావడం హర్షణీయమని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడిపెల్లి మహేష్ పేర్కొన్నారు. శుక్రవారం భద్రాచలం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కొత్త కోర్టు మంజూరుకు సహకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భీమపాక నగేష్, జస్టిస్ కాజా శరత్‌కు బార్ అసోసియేషన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. అధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ తాతా లలిత, మాజీ అధ్యక్షుడు టి.చైతన్య, న్యాయవాదులు రావి రామ్మోహన్, వైఎస్సార్ శర్మ, అవులూరి సత్యనారాయణ, తిరుమలరావు, కె.అరుణశ్రీ, ఎంవీ రమ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
కొత్తగూడెంలో మూడు, మణుగూరు, భద్రాచలంలలో ఒక్కోటి


